ఫేస్ బుక్ లో ఫైనాన్స్.. వెయ్యి మంది నుంచి రూ. 3 కోట్లు స్వాహా


 ఫేస్ బుక్ లో 'ధన ఫైనాన్స్' పేర సైబర్ నేరగాళ్లు దాదాపు వెయ్యి మందిని మోసం చేసి 3 కోట్ల రూపాయలను కాజేసిన ముఠాను పట్టుకున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏడుగురు సైబర్ నేరగాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి, అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రం టూ టవున్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన వాకిటి వంశీకృష్ణ ఫేస్ బుక్ లో 'ధన ఫైనాన్స్' ప్రకటన చూసి, రుణం కోసం తన పాన్, ఆధార్ కార్డులను అప్ లోడ్ చేయగా, వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఫేక్ లోన్ మంజూరు లేఖను రూపొందించి లోన్ మంజూరు అయ్యిందని నమ్మబలికారని ఆమె తెలిపారు. లోన్ మంజూరు ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జిఎస్టీ ,టిడిఎస్, మొదటి ఇఎంఐ పేరుతో 75,655 రూపాయలను ఫిర్యాదుదారు నుండి వసూలు చేశారు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించి టూ టవున్ పోలీసులను ఆశ్రయించాడు వంశీకృష్ణ.

రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా మహబూబ్ నగర్ తువ్వగడ్డ తాండా లో ఈ తతంగం అంతా జరుగుతుందని గ్రహించిన పోలీసులు నిందితులైన జర్పుల సురేందర్, కాట్రావత్ హనుమంతు, వడ్త్యా రాజు, వత్య భాస్కర్, కాట్రావత్ నరేష్, రాత్లావత్ సంతోష్, రాత్లావత్ సోమల లను అదుపులోకి తీసుకుని విచారించగా చాలా కాలం నుండి దాదాపు వెయ్యి మందిని మోసం చేసి 3 కోట్ల రూపాయల వరకు కాజేసినట్లు గుర్తించామని ఆమె వివరించారు. ఇందులో సురేందర్, హనుమంతు లు అక్రమంగా డబ్బు సంపాదించవచ్చని కలకత్తాలో సైబర్ నేరగాళ్ల గ్యాంగ్ వద్ద మోసాలపై శిక్షణ తీసుకున్నారని అనంతరం గ్యాంగ్ తయారుచేసి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి ఒక ల్యాప్ ట్యాప్, 2 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, 5 చిన్న కీ ప్యాడ్ ఫోన్లు, 7 వ్యక్తిగత ఫోన్లు, 1 ఆటో,1 బైక్, లక్షా 50 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు, విచారణ అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ కు పంపనున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎస్పీ లు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు ఇజాజోద్ధీన్, గాంధీనాయక్, అధికారులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow