CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!
Telangana Rising Global Summit: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేండ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం సీఎంవో అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్ని కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజంటేషన్లు తయారు చేసుకోవాలని సీఎం సూచించారు.
దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని సీఎం ఆదేశించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేండ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామన్నారు.
ఇప్పటికే ప్రజల అభిప్రాయాలు, సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదృష్టితో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన జరిగిందని సీఎం తెలిపారు. వివిధ విభాగాల అధికారులతో నిర్వహించే సమీక్షల్లో వచ్చే విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలను పొందుపరిచి డాక్యుమెంట్ కు తుదిరూపం ఇస్తామని అభిప్రాయపడ్డారు.