అన్నదాలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. 21వ విడతకు సంబంధించిన నిధులను తమిళనాడు కోయంబత్తూరులో ప్రధాని విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల పై చిలుకు మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఇందుకోసం కేంద్రం రూ.18వేల కోట్ల నిధులను కేటాయించింది.
రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం కేంద్ర సర్కారు 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' పథకాన్ని ప్రవేశ పెట్టింది. 2019 ఫిబ్రవరి నెలలో మొదలైన ఈ పథకం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ స్కీమ్ కింద ఎకరానికి ప్రతి సంవత్సరమూ 6 వేల రూపాయల నగదు అందుతోంది. మధ్య వర్తులు ఎవరూ లేకుండా రైతులకే నేరుగా నగదు అందుతోంది. వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ అవుతోంది.
పీఎం కిసాన్ స్కీమ్ కింద అందిస్తున్న మొత్తం 6 వేల రూపాయలను ఏడాదికి మూడు దఫాలుగా పంపిణీ చేస్తోంది. ఏప్రిల్ - జులై మధ్యలో మొదటి దఫా, ఆగస్టు - నవంబర్ మధ్యలో రెండో విడత, డిసెంబర్ - మార్చి మధ్య ఆఖరి విడుత నిధులు విడుదల చేస్తోంది. మూడు విడతల్లోనూ రూ.2 వేలను అన్నదాతల అకౌంట్లలో జమ చేస్తోంది.
చెక్ చేసుకోండిలా :
- పీఎం కిసాన్ లబ్ధిదారులకు డబ్బులు జమ అయ్యాయో లేదో వెంటనే తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి https://pmkisan.gov.in/ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ పోర్టల్లోకి వెళ్లిన తర్వాత "Know Your Status" అనిన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఇంకా క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి.
- మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే దాన్ని కూడా అక్కడే పొందవచ్చు. పక్కనే "Know Your Registration Number" అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
- ఇప్పుడు "Get OTP" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే మీ ఫోన్కు OTP వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు మాత్రమే ఓటీపీ వస్తుందని మరిచిపోవద్దు.
- ఓటీపీ ఎంటర్ చేయగానే బెనిఫీషియరీ స్టేటస్ మొబైల్ మీకు కనిపిస్తుంది.
- మీ అకౌంట్లో డబ్బులు పడలేదంటే మీరు e-కేవైసీ చేయించలేదన్నమాట.
రూ. 3.70 లక్షల కోట్లు!
ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతులకు లబ్ధి కలుగుతోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పుడు రాబోతున్న నిధులు 21వ విడతకు సంబంధించినవి. గత 20 విడతల్లో కలిపి మొత్తం రూ. 3.70 లక్షల కోట్ల నిధులను అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.