హైదరాబాద్: దీపావళికి భారీ శబ్ధం వచ్చే టపాసులు కాల్చాలనుకుంటున్నారు. అయితే మీకో షాకింగ్ న్యూస్. భారీ శబ్ధం వచ్చే టపాసులు కాల్చడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు. దీపావళి రోజున బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై అధిక ధ్వనిని పుట్టించే క్రాకర్లను పేల్చడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నగర వాసులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే క్రాకర్లు కాల్చడానికి అనుమతించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన డెసిబెల్ నిబంధనలు అతిక్రమించరాదని హెచ్చరించారు. శబ్ధ కాలుష్య ఫిర్యాదుల కోసం100కు డయల్ చేయవచ్చని సూచించారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టపాసులు విక్రయించే స్టాల్ యజమానులు కూడా లైసెన్స్ లేకుండా అమ్మవద్దని నార్త్ జోన్ డీసీపీ ఎస్. రష్మీ పెరుమాల్ తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రాకర్లను అధికారులు.. 'సౌండ్ ఎమిటింగ్', 'సౌండ్ అండ్ లైట్ ఎమిటింగ్'గా వర్గీకరించారు. “రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య తప్ప మిగతా టైంలో పెద్ద శబ్దాలు చేసే క్రాకర్స్ పేల్చడంపై నిషేధం ఉంటుంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం పగటిపూట ధ్వని స్థాయిలు 55 డెసిబెల్‌లను మించరాదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని రష్మీ తెలిపారు. ఆందోళనలో దుకాణదారులు..
గతేడాది(2023) రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉండటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీపావళి కూడా అప్పుడే రావడంతో టపాసుల అమ్మకాలపై భారీగా ప్రభావం పడింది. అయితే ఈసారి అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా గిరాకీ బాగా అవుతుందని తాము భావించామని, పోలీసుల ఆంక్షలతో అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని యజమానులు అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ అక్టోబర్ 26 నాటికి టపాసుల దుకాణాలకు లైసెన్స్ కోసం 7 వేల దరఖాస్తులను స్వీకరించింది. ఈ సారి అందిన మొత్తం దరఖాస్తులు 6,953 అని.. వాటిలో 6,104 అప్లికేషన్లను ఆమోదించామని తెలంగాణ డైరెక్టర్ జనరల్ తెలిపారు. 2023లో లైసెన్స్‌ల కోసం 6,610 దరఖాస్తులు వచ్చాయి. బాణసంచా వల్ల 2023లో 75 మంది గాయపడ్డారు. టపాసులు పేల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక దళ అధికారులు చెబుతున్నారు.