కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని భావిస్తోంది. కొత్తగా తెచ్చే బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రం అంటొంది. అయితే, సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఇక, ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
అసలు వక్ఫ్ అంటే ఏంటి, దీనిపై ఎవరి వాదనలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లాం సంప్రదాయంలో, ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశానాలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములను స్థానిక వక్ఫ్ బోర్డు సభ్యులతో కుమ్మక్కై చాలా భూముల్ని కబ్జాకోరులు కబ్జా చేసేశారు.
కొంత మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని ముస్లిం సంఘాలు సైతం అంగీకరిస్తున్నాయి. ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు చెబుతున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపిస్తున్నారు.
12వ శతాబ్ధంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన దిల్లీ సుల్తానుల పాలనతో భారత్‌లో ఈ వక్ఫ్ ఆచారం మొదలైంది. అయితే, 1995లో చేసిన వక్ఫ్ చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నింటినీ రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. కాగా, దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9లక్షల 40వేల ఎకరాల్లో ఉన్నాయని, వీటి విలువ 1.20 లక్షల కోట్లు ఉంటుందని ప్రాధమిక అంచనా ఉంది.