రాష్ట్రంలో ఐదేళ్లుగా బీజేపీ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో వచ్చిన ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి.. ఒకానొక దశలో బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిందని అనిపించింది.
కేంద్ర కేబినెట్ కూర్పుపై పాలమూరు బీజేపీ నాయకుల్లో ఆసక్తి
మహిళ, ఫైర్ బ్రాండ్ ముద్ర అరుణకు కలిసొచ్చే అవకాశం
ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం
పార్టీలోనూ అనతికాలంలో జాతీయ ఉపాధ్యక్షురాలి స్థాయికి..
గతంలో జిల్లా నుంచి ఒకరు.. జిల్లావాసి ఒకరికి మంత్రి పదవి
రెండు బెర్తులు ఇస్తే కచ్చితంగా ఆమెకు రావొచ్చనే అభిప్రాయం
మహబూబ్‌నగర్, రాష్ట్రంలో ఐదేళ్లుగా బీజేపీ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో వచ్చిన ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి.. ఒకానొక దశలో బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిందని అనిపించింది. అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుని.. అధికారంలోకి రావడంతో బీఆర్‌ఎస్ ప్రతిపక్షంగా మారింది. అయినప్పటికీ.. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో 2019తో పోల్చితే మరో నాలుగు స్థానాలు అధికంగా గెలవడంతో సభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పుడు బీజేపీ ముందున్న లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తేవడమే. ఆ దిశగానే పార్టీ ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫైర్‌బ్రాండ్లతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం రానున్న ఐదేళ్లపాటు చేయనుంది. ఇప్పటికే ఒక్క పార్లమెంట్ సీటు సాధించకపోవడంతో బీఆర్‌ఎస్ పూర్తిగా చతికిలపడిపోయింది. ఈక్రమంలో కేంద్ర కేబినెట్‌లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే విషయం చాలా కీలకంగా మారింది. భవిష్యత్ ప్రణాళికల ప్రకారమే.. అటు పార్టీని నడిపించడంతోపాటు.. ఇటు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఎవరు ఉపయోగపడతారనే విషయంలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ప్రస్తావనకు వస్తోంది. ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న క్రమంలో డీకే అరుణకు కచ్చితంగా కేబినెట్ బెర్తు వస్తుందని పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
ఫైర్‌బ్రాండ్ పేరు కలిసొచ్చే అవకాశం..
డీకే అరుణకు దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1996లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి.. రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె.. 2004, 2009, 2014లో గద్వాల నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓటమి చెందారు. 2019లోనూ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఈ 2024 ఎన్నికల్లో.. హోరాహోరీ పోరులో.. సీఎం సొంత నియోజకవర్గంలో బీజేపీ తరఫున గెలిచారు. రాష్ట్రంలో గెలిచిన మహిళా ఎంపీ అరుణ ఒక్కరే. ఆమె రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్న సమయం నుంచి అరుణ ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. గత కేంద్ర కేబినెట్‌లో కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉండగా.. అంతకుముందు బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఈసారి ఎంపీలు ఎక్కువగా సాధించిన నేపథ్యంలో రాష్ర్టానికి రెండు కేబినెట్ బెర్తులు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకవేళ కేబినెట్ బెర్తులు రెండు రాకపోయినా.. ఒకటి సహాయమంత్రి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కచ్చితంగా మహిళా కోటాలో అరుణకు కేబినెట్ బెర్త్ ఖాయమని పార్టీ నాయకులు భావిస్తున్నారు. గత కేబినెట్‌లో స్మృతి ఇరానీ ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారు. కానీ ఈసారి ఆమె ఓటమి చెందడంతో అరుణకు అవకాశం వస్తుందనే అభిప్రాయం వస్తోంది. గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన డీకే అరుణ.. 2018లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. అందులో చేరిన అనతికాలంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని సాధించగలిగారు. ఇప్పుడు కూడా తనకు జాతీయ స్థాయిలో ఉన్న సంబంధాలతో మంత్రి పదవికి దక్కవచ్చనే చర్చ జరుగుతోంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం..
డీకే అరుణ పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండు కుటుంబాలకూ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, మామ డీకే సత్యారెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేసినవారే. అలాగే తన భర్త భరతసింహారెడ్డి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనకు కేడర్, వర్గం అంటూ ఉంది. భవిష్యత్‌లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అధికారం చేపట్టాలంటే.. కచ్చితంగా ఫైర్‌బ్రాండ్ అవసరం ఉంటుంది. గతంలో నాలుగు ఎంపీలు గెలిస్తే.. ఒక మంత్రి పదవి రాగా.. ఇప్పుడు ఎనిమిది ఎంపీ స్థానాలు గెలవడంతో రెండు పదవులు ఖాయమనే అభిప్రాయం ఉంది. గతంలో పాలమూరు నుంచి మల్లికార్జున్‌గౌడ్ కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పని చేశారు. మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలవగా.. ఇక్కడి నుంచే కేంద్ర కేబినెట్‌లో ప్రవేశం పొందారు. అలాగే ఈ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్ జైపాల్‌రెడ్డి కూడా కేంద్రమంత్రిగా చేసినప్పటికీ.. చేవెళ్ల, మిర్యాలగూడ స్థానాల నుంచి గెలిచినప్పుడు ఆయనకు కేంద్రమంత్రి పదవులు వరించాయి. అలా పాలమూరు నుంచి ఒకరు.. పాలమూరు వాసి ఒకరు కేంద్రమంత్రి పదవులు అనుభవించారు. డీకే అరుణకు మంత్రి పదవి వస్తే.. మూడోసారి కేంద్రమంత్రి పదవి పాలమూరును వరిస్తుందని చెప్పొచ్చు. కేంద్ర కేబినెట్‌లో పాలమూరు ఎంపీ ఉండటం ద్వారా వెనుకబడిన ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.