cరాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్
జడ్చర్ల : హక్కుల పోరాటంలో ప్రాణాలు వదిలిన మాదిగ అమర వీరుల సంస్మరణ సభను జయప్రదం చేద్దామని మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్ పిలుపునిచ్చారు.
జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో సంస్మరణ సభకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్ మాట్లాడుతూ ఏ బి సి డి వర్గీకరణ పోరాటం మొదలయ్యి 30 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా వచ్చే నెల జులై 7న హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమానికి మాదిగ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల నాగేందర్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కలపల్లి రాజేందర్ లతోపాటు మాదిగ జర్నలిస్టులు, ఎం ఆర్ పి ఎస్ ఉద్యమకారులు పాల్గొంటారని తెలిపారు. 30 ఏళ్లుగా మాదిగ జనాభా దమాషా ప్రకారం ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని సంకల్పంతో ఉద్యమాలు చేపడుతున్నామని అన్నారు. వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది మాదిగ బంధువులు అమరులయ్యారని ఆ అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు మాదిగ జర్నలిస్టు ఫోరం సభ్యులతోపాటు ప్రతి ఒక్క మేధావి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి పుల్లగల శ్రీధర్, రాష్ట్ర నాయకులు దాసు, గిద్ద విజయ్ కుమార్, దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దగ్గుల బాలరాజ్, కరాటే శ్రీను, మెట్ట యాదయ్య, తుడుం శివ దర్శన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.