టికెట్ కోసం టఫ్ ఫైట్.. హాట్ సీటుగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం*

 *💥టికెట్ కోసం టఫ్ ఫైట్.. హాట్ సీటుగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం*







*మహబూబ్‌నగర్ జనవరి17*:- మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ముమ్మరంగా ప్రచారాన్ని ప్రారంభించారు.ఓ వైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు భక్తి, ఇతర సామాజిక కార్యక్రమాలతో జనానికి చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ టికెట్ తమకంటే తమకే వస్తుందంటూ ఎవరి ధీమాలో వారు ఉన్నారు. జాతీయ నాయకురాలిగా, మహిళ నాయకురాలిగా, గత పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కారణంగా ఈ సారి టికెట్ తప్పనిసరిగా తనకే వస్తుందన్న ధీమాతో డీకే అరుణ ముందుకు వెళ్తున్నారు.


పార్లమెంటు పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు, క్రీడలు తదితర పోటీలను నిర్వహించడంతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, గత పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగే ఎన్నికల్లో టికెట్ హామీతోనే పార్టీలో చేరిన జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి ఈసారి టిక్కెట్టు తప్పనిసరిగా తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడిని పోటీ చేయించడంతో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్న అభ్యర్థుల కోసం తన వంతు ప్రయత్నాలు సాగించారు. 


అధిష్టానంతో ఉన్న పరిచయాలు, తదితర కారణాల వల్ల అవకాశం తనకే వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలను కూడా కలిసి తనకు టికెట్‌ను ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇప్పటికే రెండు మూడుసార్లు పార్టీ ప్రయోజనాల కోసం టికెట్‌ను త్యాగం చేశాను. పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈసారి బీసీ కోటాలో తనకు తప్పకుండా టికెట్ వస్తుందన్న నమ్మకంతో శాంతి కుమార్ ఉన్నారు. అదేవిధంగా ఈ ముగ్గురితో పాటు బీజేపీ రాష్ట్ర నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి సైతం తనకు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.


*కలిసికట్టుగా పని చేస్తేనే..* 


మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నాయకులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టికెట్ ఒకరికి వస్తే మిగతా వారు ఏ మేరకు సహకరిస్తారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న కారణంగా టికెట్ కోసం నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బయటకు టికెట్ ఎవరికి వచ్చిన గెలిపిస్తామరని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఒకరు అంటే ఒకరికి గిట్టని పరిస్థితులు నెలకొంటున్నాయి. పార్టీ అధిష్టానం టికెట్ ఆశిస్తున్న నేతలతో సమావేశమై సమన్వయం కుదిరిస్తే తప్పా.. పార్టీ అభ్యర్థులు గెలవడం సాధ్యం కాని పరిస్థతి కాదు. రానున్న రోజులలో అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.

Previous Post Next Post

نموذج الاتصال