టార్గెట్ ఫిక్స్.! లక్ష్యం దిశగా కాంగ్రెస్ పావులు.. నేడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ క్షేత్రస్థాయి మీటింగ్..
తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల నగారా మోగకముందే పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది హస్తం పార్టీ. పార్లమెంట్ ఎన్నికలకు బూత్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేయడమే ఈ మీటింగ్ అజెండా.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త బూత్ లెవెల్ ఏజెంట్లతో ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ మీటింగ్‌కి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. బూత్ లెవెల్ ఏజెంట్లంతా ఈ మీటింగ్‌కి హాజరు కావాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీనియర్ నాయకులు పాల్గొంటారు. బూత్ కన్వీనర్లు, నాయకులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. 36వేల మంది బూత్ స్థాయి కన్వీనర్లు సమావేశానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది హస్తం పార్టీ.
అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఎజెంట్లే క్రియాశీలకంగా పనిచేశారు. గ్రౌండ్ లెవల్‌లో శ్రమించి.. రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న హస్తం పార్టీ.. బూత్ లెవెల్ ఏజెంట్లను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని పార్టీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు.
ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన అధిష్టానం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో కీలకమైన పోల్‌మేనేజ్‌మెంట్‌పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు.