న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఐదు అంతస్తుల భవనం ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం వద్దకు పెద్దఎత్తున స్థానికులు కూడా చేరుకున్నారు. కూలిపోయిన భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు
భారీ రాళ్లు, కాంక్రీట్ శ్లాబ్‌లను తొలగిస్తూ బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమాపురి గోల్‌చక్కర్, డీఎల్‌ఎఫ్ భోపురా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
బాధితులను కాపాడేందుకు అంబులెన్స్‌లు, రెస్క్యూ వాహనాలు ఘటనాస్థలికి వేగంగా చేరుకునేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రహదారులను ఖాళీగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ఆగడం, వాహనాలను పార్క్ చేయడం లేదా పెద్దఎత్తున గుమిగూడటం వంటివి చేయవద్దని సూచించారు.
భవనం కూలడానికి గల కారణాలు, ఎవరైనా మృతిచెందారా, శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.