ఉపాధ్యాయుడిగా ఉండి చిట్టీ మోసాలు.. వందలాది మందిని నట్టేట ముంచిన టీచర్
విద్యార్థులకు నీతి, ఆదర్శాలను బోధిస్తూ, సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు. నమ్మకమే పెట్టుబడిగా చిట్టీలు, డైలీ కలెక్షన్ల పేరుతో కోట్లు వసూలు చేశాడు.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఏనెగంటి తండాకు చెందిన బానోత్ రాజు ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మొదట్లో ఇటుక బట్టీలు, డెయిరీ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. ప్రభుత్వ ఉద్యోగం, సమాజంలో ఉన్న గౌరవాన్ని ఆసరాగా చేసుకుని, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో చిట్టీల దందాకు తెర లేపాడు.
తన భార్య అనూష సహకారంతో సూర్యాపేట రూరల్, చివ్వెంల పరిసర ప్రాంతాల్లో చిట్టీల వ్యాపారం, డైలీ కలెక్షన్లు ప్రారంభించాడు. స్థానికుల నుండి ప్రతిరోజూ రూ.2 లక్షల వరకు డైలీ కలెక్షన్లు, అప్పుల రూపంలో వసూలు చేశాడు. ప్రభుత్వ టీచరే కదా, ఎక్కడికి పోతాడు అనే నమ్మకంతో తోటి ఉద్యోగులు, వ్యాపారులు, అమాయక తండా ప్రజలు తమ కష్టార్జితాన్ని రాజు చేతిలో పెట్టారు.
బాధితులు నిలదీయడంతో గుట్టురట్టు
చిట్టీల గడువు పూర్తికావడం, బాధితులు పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో రాజు అసలు రంగు బయటపడింది. ఫోన్ స్విచ్చాఫ్ చేసి, కాలయాపన చేస్తూ కుటుంబంతో సహా పరారయ్యాడు. చివరకు బాధితులంతా కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విలాసాలకు వసూళ్లు
ప్రజల నుండి వసూలు చేసిన కోట్లాది రూపాయల సొమ్మును రాజు తన వ్యక్తిగత అవసరాలకు, విలాసాలకు, అలాగే ఆస్తులు కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుండి తీసుకున్న ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు, భూముల లావాదేవీల పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.