గుడ్ న్యూస్.. టీబీ అంతానికి కొత్త వ్యాక్సిన్‌లు!
గుడ్ న్యూస్.. క్షయ వ్యాధి (TB) అంతానికి కొత్త వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి. 2029 నాటికి కొత్త టీబీ వ్యాక్సిన్లు మార్కెట్లోకి రానున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న BCG వ్యాక్సిన్ ప్రధానంగా శిశువులకు మాత్రమే టీబీ నుంచి కాపాడగలదు. అయితే రాబోయే కొత్త వ్యాక్సిన్లు అన్ని వయసుల వారికి, ముఖ్యంగా యువత, పెద్దలలో ఊపిరితిత్తులకు టీబీ సోకకుండా నివారించేందుకు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్లతో ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం గల దేశాలకు బిలియన్ల కొద్ది ఆర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని వ్యాక్సిన్ అలయన్స్ సంస్థ Gavi వెల్లడించింది.
గావి ది వ్యాక్సిన్ అలయన్స్ ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం, 2029 నుంచి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్న కొత్త క్షయ (టీబీ) వ్యాక్సిన్‌లు 2030–2050 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 73 లక్షల మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది.
తక్కువ ఆదాయం గల దేశాలకు ఇవి 135 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక ప్రయోజనాలు అందించగలవని అధ్యయనం చెబుతోంది. టీబీకి కారణమయ్యే మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.07 కోట్ల కేసులు, 12 లక్షల మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక BCG టీకా శిశువుల్లో తీవ్రమైన టీబీని నిరోధించినా, దాని రక్షణ కాలక్రమేణా తగ్గుతుంది.