ఇంటి ఆడబిడ్డగా కల్వకుంట్ల కవిత.. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన నాయకుడు బాషబోయిన బాలప్రసాద్ తన వివాహాన్ని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరిపించాలని ఆకాంక్షించారు. తనకు అక్కాచెల్లెళ్లు లేనందున.. ఇంటి ఆడబిడ్డగా కవిత వివాహ వేడుకలో పాల్గొని ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం వధువుకు తాళి కట్టించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
బాలప్రసాద్ ఆకాంక్షను గౌరవించిన కల్వకుంట్ల కవిత.. ముదిరాజ్ కుటుంబానికి చెందిన ఇంటి ఆడబిడ్డగా వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక వేడుకకు ఈసీఐఎల్–కీసర క్రాస్ రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్ వేదికగా నిలిచింది.
ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్లు
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ జాగృతిలోనూ ఆయన క్రియాశీలంగా పనిచేశారు. బాలప్రసాద్‌కు సీతాఫల్‌మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయమైంది.
బుధవారం ఉదయం వివాహ ముహూర్తం సందర్భంగా బాలప్రసాద్ కోరిక మేరకు కల్వకుంట్ల కవిత ఇంటి ఆడబిడ్డ హోదాలో వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు మంగళసూత్రం కట్టే ముందు ఆడపడుచు పసుపు కొమ్ముతో మూడు ముళ్లు వేయించే సంప్రదాయం ఉంది. అదే సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని, వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు.
అనంతరం వధువు ఉంగరపు వేలికి ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి వధువు శివానిని ఆశీర్వదించారు. ఆ తర్వాత బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్రం ధరింపజేశారు.
ఈ వివాహ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప–బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కుటుంబ అనుబంధానికి ప్రతీకగా..
తనకు అక్కాచెల్లెళ్లు లేరన్న బాలప్రసాద్ కోరికను గౌరవించి.. ముదిరాజ్ సంప్రదాయంలో ఇంటి ఆడబిడ్డగా కల్వకుంట్ల కవిత వివాహ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వధూవరులను కవిత ఆశీర్వదించారు.