Ambulance stuck in traffic due to cricket match in Uppal.. Baby dies after running out of oxygen
హైదరాబాద్ ఉప్పల్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్ కారణంగా ఏర్పడిన భారీ ట్రాఫిక్ ఒక బాలింత ప్రాణం తీసిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్‌లో గంటన్నర పాటు అంబులెన్స్ చిక్కుకుపోవడంతో ఆక్సిజన్ అయిపోయి మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ఘట్‌కేసర్‌లో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన సురేష్–బిష్ణ దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం బిష్ణ (30)కు అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆమెను సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మొదట బీబీనగర్ ఎయిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో నిమ్స్‌కు తీసుకెళ్తుండగా, ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు అంబులెన్స్ ట్రాఫిక్‌లోనే నిలిచిపోయింది. డ్రైవర్, బంధువులు ఎంత ప్రాధేయపడినా వాహనాలు దారి ఇవ్వలేదని సమాచారం.
ఈ సమయంలో అత్యవసరంగా ఉపయోగిస్తున్న ఆక్సిజన్ సిలిండర్ పూర్తిగా అయిపోవడంతో బిష్ణకు శ్వాస అందక అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో ఆమె ముగ్గురు చిన్నారులు తల్లిలేని పిల్లలుగా మిగిలిపోయారు.
కుటుంబ సభ్యులు మరియు అంబులెన్స్ సిబ్బంది ప్రకారం, ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు సమయానికి స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు కాపాడేవారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నగర ట్రాఫిక్ నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.