ఫేస్‌బుక్ పరిచయం… చివరకు ఒక కుటుంబాన్ని నాశనం చేసింది!



ఫేస్‌బుక్ పరిచయం… కుటుంబంలో విషాదం
ప్రియుడి మోజులో వెళ్లిన భార్యను భర్త హత్య

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది సమీపంలో ఆదివారం రాత్రి సంచలన ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ పరిచయం కారణంగా భర్తను, ఇద్దరు చిన్నపిల్లలను వదిలి వెళ్లిన మహిళ చివరికి భర్త చేతిలోనే హత్యకు గురైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఝరాసంగం మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన సిద్ధారెడ్డి(35), కవిత(29) భార్యాభర్తలు. వీరు జహీరాబాద్ పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతుండగా, కవిత టైలర్‌గా పనిచేస్తోంది. వీరికి తొమ్మిదేళ్ల కూతురు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.

దాదాపు పదేళ్ల క్రితం కవితకు చిత్తూరు జిల్లా తిరుపతి మండలం చంద్రగిరికి చెందిన పవన్‌కుమార్ రెడ్డి(32)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 27 అర్ధరాత్రి సమయంలో కవిత తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి జడ్చర్లలో ఉంటున్న పవన్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లిపోయింది.

భార్య కనిపించడం లేదని సిద్ధారెడ్డి మార్చి 28న జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో కవిత జడ్చర్లలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఆమెను జహీరాబాద్‌కు తీసుకురావడానికి కానిస్టేబుల్ ఖదీర్, భర్త సిద్ధారెడ్డి కలిసి కారులో జడ్చర్లకు వెళ్లారు.

పోలీసులు కవిత, పవన్‌కుమార్ రెడ్డికి కౌన్సెలింగ్ నిర్వహించి భర్తతో వెళ్లాలని సూచించారు. అయితే కవిత ఇందుకు నిరాకరించడమే కాకుండా భర్తను అసభ్య పదజాలంతో దూషించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కోపంతో ఉన్న సిద్ధారెడ్డి చాయ్ తాగేందుకు వెళ్తున్నానని చెప్పి చాకు కొనుగోలు చేశాడు.

తరువాత కవిత, ఆమె ప్రియుడు పవన్‌కుమార్ రెడ్డి, భర్త సిద్ధారెడ్డి, కానిస్టేబుల్ ఖదీర్ కలిసి కారులో జహీరాబాద్‌కు బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత సిద్ధారెడ్డి అకస్మాత్తుగా జేబులో ఉన్న చాకు తీసి కవిత గొంతు, మెడపై దాడి చేశాడు.

ఈ ఘటనతో అప్రమత్తమైన కానిస్టేబుల్ వెంటనే కారును సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమని డ్రైవర్‌కు సూచించాడు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే కవిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow