ఎమ్మెల్యే ఫిర్యాదుకు స్పందించని కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై మండిపాటు – సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం
జడ్చర్ల, ప్రతినిధి:
జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలను లెదర్ పార్క్ భూముల్లో అక్రమంగా పారబోస్తున్న ఘటనపై రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని మంత్రి మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల ఫిర్యాదులకే స్పందించని అధికారులు సాధారణ ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
పరిస్థితిపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, ఈ అంశంపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
అదే విధంగా రెడ్ జోన్ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరుకావాలని సూచించారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ, పరిశ్రమల వ్యర్థాల నిర్వహణలో కఠిన చర్యలు తీసుకునేలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.