ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..


 కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య గొడవలకు చిన్నారులు బలి అవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే.. ఆవేశంతో అభం శుభం తెలియని చిన్నారులను అంతమొందిస్తున్నారు. ముక్కు పచ్చలారని పసికందులు ప్రాణాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. భార్యపై కోపంతో ఓ తండ్రి తన రెండేళ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం గ్రామానికి చెందిన శ్రీరాములు బధిర దివ్యాంగుడు. శ్రీరాములుకు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన నాగమణితో వివాహమైంది. ఈమె కూడా బధిర దివ్యాంగురాలే. వీరికి రెండేళ్ల కూతురు నిత్యశ్రీ ఉంది. నిన్నటిదాకా ఆ ఇంట్లో ఆ చిన్నారి ముద్దులొలికే మాటలు.. బుడిబుడి అడుగులు.. గజ్జెల సవ్వడులు.. ఆ తల్లిదండ్రులకు ఆ పాపే ఒక లోకంగా మారింది. కానీ క్షణికావేశం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. తరచూ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూతురు నిత్యశ్రీని తీసుకుని నాగమణి తల్లిగారింటికి వెళ్ళింది. పెద్దలు సర్ది చెప్పడంతో ఉగాది నాడు తిరిగి భర్త వద్దకు వచ్చింది. అయితే, రెండేళ్ల చిన్నారి నిత్యశ్రీ తాత మల్లయ్యపై బెంగ పెట్టుకుంది. ఇదే సమయంలో తిరిగి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఇదే విషయాన్ని నాగరాణి తన తండ్రి మల్లయ్యకు సమాచారం ఇచ్చింది. దీంతో కూతురిని తన ఇంటికి తీసుకువెళ్లేందుకు హన్మాపురానికి మల్లయ్య వచ్చాడు. మల్లయ్యతో భార్య కూతురిని పంపడం శ్రీరాములకు ఇష్టం లేదు. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన తాతయ్య ఒడిలో నిత్యశ్రీ కూర్చుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీరాములు నిత్యశ్రీని తన బైక్ పై గ్రామ శివారులోనీ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. తాతపై బెంగ పెట్టుకున్న నిత్యశ్రీ బాగా ఏడ్చింది. దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీరాములు.. నోరు, ముక్కును అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.

తిరిగి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కుమార్తెను తన భర్త హత్య చేయడంతో నాగరాణి కన్నీరు మున్నీరుగా విలపించింది. తనను వేధించడమే కాకుండా.. కన్న కుమార్తె ప్రాణం తీశాడంటూ సైగలతో చెబుతుండటం అందరినీ కన్నీరు పెట్టించింది. నిత్యశ్రీ తాత కుట్ల మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow