సురేష్ మరణానికి కారణాలు ఏమిటి, కాలేజీలో ఏవైనా వేధింపులు జరిగాయా అనే కోణంలో లోతైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సంఘటన సమాజానికి తీరని లోటని, విద్యార్థుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇక ఘటన జరిగిన రోజున, సురేష్ అధిక మోతాదులో ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకుని హాస్టల్ గదిలో అచేతనంగా పడిపోయాడు. ఉదయం కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నేహితులు వెళ్లి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సురేష్ కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగారు. సీనియర్లు అధిక పని ఒత్తిడి, సుదీర్ఘ డ్యూటీలతో వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు సురేష్ సెల్‌ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. కాల్ రికార్డులు, మెసేజులు, సోషల్ మీడియా వివరాలు పరిశీలిస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్ సేకరించి, తోటి విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్ పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి, ఒత్తిడి, కోర్సు అసంతృప్తి, ర్యాగింగ్ వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను కూడా సీరియస్‌గా తీసుకున్నామని పోలీసులు తెలిపారు.