95 చలాన్లు.. ₹35 వేల ఫైన్: ఏడాదిన్నర ఎస్కేపింగ్ డ్రామాకు ఎల్‌బీ నగర్‌లో ఎండ్ కార్డ్!
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలను వరుసగా ఉల్లంఘిస్తూ దాదాపు ఏడాదిన్నర కాలం పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ కారును ఎట్టకేలకు ఎల్‌బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎల్‌బీ నగర్ పరిధిలో సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన మారుతి ఎర్టిగా (TS 09GE 7619) కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు.
కారు వివరాలు చెక్ చేయగా ఒక్కసారిగా పోలీసులకు షాక్ తగిలింది. ఆ వాహనంపై మొత్తం 95 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ చలాన్ల ద్వారా సుమారు ₹34,600 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కారు యజమాని పోలదాసు సురేష్ గతంలో మూడు సార్లు పోలీసులకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా తరచూ ఉల్లంఘనలు చేస్తూ పోలీసులకు తలనొప్పిగా మారినట్లు చెప్పారు.
ఎట్టకేలకు ఎస్‌ఐ రవికుమార్ బృందం చాకచక్యంగా ఆ కారును పట్టుకుని సీజ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న అన్ని చలాన్లను చెల్లించిన తరువాత మాత్రమే వాహనాన్ని విడుదల చేస్తామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
అయితే జరిమానా చెల్లించేందుకు కారు యజమాని నిరాకరించడంతో, కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.