Jeevan Reddy: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో కీలక పోస్ట్..?

Jeevan Reddy: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటం దాదాపు ఖాయమైంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్ పదవిని అప్పగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని, సీఎంను డిఫెన్స్ లో పడేసేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే జీవన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన కాంగ్రెస్ ను వీడుతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ ఏం అన్యాయం చేసిందని.. ఆయనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని.. ఏం తక్కువ చేసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

42 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి గుడ్ బై?


జీవన్ రెడ్డి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేత మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి. ఆ జిల్లాలో ఆయనకు పట్టుంది. ఒకానొక దశలో జిల్లాలో పార్టీని నిలబెట్టిన నేతగా గుర్తింపు అయింది. 1984లో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1983లో టీడీపీలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఎన్‌టీ రామారావు 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1989, 1996 ఉప ఎన్నికలతో పాటు 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాడు. 2004 మే 14 నుండి 2009 మార్చి 2 వరకు వైఎస్ఆర్ మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 2006, 2009లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. జీవన్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. జీవన్ రెడ్డికి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కొన్ని ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మళ్లీ అవకాశం ఇచ్చి రాజకీయంగా నిలబెట్టింది. పార్టీతో ఆయనకు 42 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే ఆయన పార్టీని వీడనున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

26న బీఆర్ఎస్ లో చేరిక?


జీవన్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు ప్రయార్టీ ఇవ్వడం లేదని బహిరంగానే పేర్కొంటున్నారు. గత కొంత కాలంగా పార్టీ అంతర్గత పరిణామాలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ప్రస్తుత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌తో జీవన్ రెడ్డికి పొసగడం లేదు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తనకు కాకుండా, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అధిష్ఠానం ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని 2024 అక్టోబర్​లో జీవన్‌రెడ్డి పార్టీ హైకమాండ్‌కు లేఖ కూడా రాశారు. తీవ్ర మానసిక బాధతో ఈ లేఖ రాస్తున్నానని అందులో పేర్కొన్నారు. పార్టీలో కొన్ని స్వార్థపూరిత శక్తులు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్‌పర్శన్‌ పదవి వరకు అన్ని నిర్ణయాల్లోనూ సంజయ్‌ కుమార్ వర్గానికి పెద్ద పీట వేశారని, దీని వల్ల జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్య తగ్గుతూ వచ్చిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తను కాదని సంజయ్‌ కుమార్‌కు నియోజకవర్గ పగ్గాలు అప్పగించడం, స్థానిక నిర్ణయాల్లో తన ప్రమేయం లేకుండా పోవడం ఆయనను తీవ్రంగా బాధించిందని బహిరంగంగానే జీవన్ రెడ్డి పేర్కొంటున్నారు. అందుకే పార్టీని వీడబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ నెల 26న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే తేదీమాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. చేరిక మాత్రం పక్కా అని క్లారిటీ ఇచ్చారు.

సీఎంను ఇరుకునబెట్టేలా గులాబీ స్కెచ్?

రాష్ట్రంలో జట్ స్పీడ్ తో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. 2023 తర్వాత రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అసెంబ్లీ ఉప ఎన్నికలు, పార్లమెంట్, ఎమ్మెల్సీ, పంచాయతీ, మున్సిపల్ ఇలా అన్ని ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయ దుందుభీ మోగించింది. అయితే ఈ స్పీడ్ ను చూసి గులాబీ పార్టీ రాబోయే కాలంలో కష్టకాలం తప్పదని భావించే కొంత పార్టీపై అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి గాలం వేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ సీనియర్ నేతగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పట్టుండటం తమకు కలిసి వస్తాయని భావించి చేర్చుకునేందుకు స్కెచ్ వేసినట్లు ప్రచారం ఊపందుకుంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీపై, సీఎంపై అసంతృప్తి పెరుగుతుందని, సీనియర్ నేతలంతా పరిపాలన సరిగ్గా లేకపోవడంతోనే పార్టీని వీడే పరిస్థితులు వచ్చాయనే ఇండికేషన్ ను కేడర్ లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. సీఎంను డిఫెన్స్ లో పడేయాలని జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు కేశవరావు ప్లేస్ ను రీప్లేస్ మెంట్ చేసేందుకే జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పదవి అప్పగించబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకే గులాబీ పక్కా స్కెచ్ అనేది స్పష్టమవుతోంది.

జీవన్ రెడ్డిపై విమర్శలు..


జీవన్ రెడ్డి 1984 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చింది. ఓడిపోయినప్పటికీ ఆయనకు కరీంనగర్ జిల్లాతో పాటు పార్టీలోనూ ప్రయార్టీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అవకాశం కల్పించింది. అక్కడ ఓడిపోయినా మళ్లీ వచ్చిన ఎన్నికల్లోనూప్రాధాన్యం ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే 2019 కరీంనగర్ పట్టభద్రుల స్థానం అవకాశం ఇవ్వడంతో విజయం సాధించారు. ఇలా అన్ని అవకాశాలు కల్పించడంతో పాటు సుమారు 42 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది. అయితే ఇప్పుడు అసంతృప్తి అనే ఒకే కారణంలో కాంగ్రెస్ ను వీడుతుండటంతో పార్టీ నాయకులు, కేడర్ విమర్శలు ఎక్కుపెట్టారు. అన్ని పదవులు అనుభవించి పార్టీ వీడటం ద్రోహం చేసినట్లే అవుతుందని పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఉంటే పరిష్కరించుకోవాలే కానీ పార్టీని వీడటం ఏంటని, పదవులకోసమే బీఆర్ఎస్ లో చేరుతున్నారా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతుండటంపై మాత్రం సర్వత్రా జీవన్ రెడ్డి తీరుపై చర్చజరుగుతుంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow