శ్రీ పరాభవ నామ సంవత్సరం రాశిఫలం

ఆదాయం 11; వ్యయం 5, రాజపూజ్యం 2; అవమానం 4

ఈ ఏడాది మీకు అనుకూలమైన కాలం. డిసెంబరు ఆరంభం వరకూ లాభ స్థానంలో రాహువు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అన్ని వైపుల నుంచీ డబ్బు ప్రవహిస్తుంది. వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి, మాట విలువను కాపాడుకోవాలి. రాహువు రాజ్యస్థానంలో ఉండటంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వరుస విజయాలు సిద్ధిస్తాయి. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శనీశ్వరుడు వ్యయ స్థానాన్ని ఆక్రమించడం వల్ల అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. సంవత్సర ప్రథమార్ధంలో గురువు తృతీయంలో ఉంటాడు కాబట్టి, తోబుట్టువులతో సఖ్యతగా మెలగాలి. జూన్‌ 2 నుంచి గురువు ఉచ్చస్థితిలో... అంటే, నాలుగో రాశిలో కొలువుదీరతాడు. ఆ ప్రభావంతో గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ సంవత్సరం అక్టోబరు నుంచి విద్యార్థులకూ, ఉద్యోగార్థులకూ అత్యంత అనుకూలం. దైవబలం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినీ, వేంకటేశ్వరుడినీ దర్శించుకోవాలి.

ఆదాయం 5; వ్యయం 14; రాజపూజ్యం 5; అవమానం 4

ఈ ఏడాది రాజయోగం లభిస్తుంది. సంవత్సరమంతా శని లాభ స్థానంలో సంచరించడం, రాహువు రాజ్య స్థానంలో ఉండటం... కలిసొచ్చే అంశాలు. డిసెంబరు 7 నుంచి రాహువు భాగ్యంలో కొలువుదీరడం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. సంవత్సరం ఆరంభంలో గురువు ధన స్థానంలో ఉండటంతో, ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్‌ నుంచి గురువు మూడో ఇంటికి మారతాడు. ఆ ప్రభావంతో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, అక్టోబరు తర్వాత, గురువు నాలుగో ఇంటికి చేరతాడు. దీంతో కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవుతాయి. డిసెంబరు 7 నుంచి కేతువు తృతీయంలో ఉండటంతో, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శక్తికొద్దీ అన్నదానం చేయండి. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి, శివుడిని పూజించండి.



ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 7

ఆరంభం సాధారణంగానే ఉన్నా, జూన్‌ నుంచి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. జూన్‌ 2 వరకూ గురువు జన్మరాశిలో ఉండటం వల్ల మానసిక ఆందోళనలు తలెత్తవచ్చు. ఆ తర్వాత గురువు ధన స్థానానికి మారడం చేత, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శని సంచారం కారణంగా వృత్తి, ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. రాహువు భాగ్యంలో కొలువుదీరడంతో ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అదే రాహువు అష్టమ స్థానంలో కొన్ని ఇబ్బందులు కలిగించే ఆస్కారం ఉంది. డిసెంబరు 7 నుంచి కేతువు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఆ సమయంలో మితభాషణం మంచిది. అక్టోబరు తర్వాత గురువు మూడో ఇంటికి వెళ్లినా, శని అనుకూలత కాపాడుతుంది. జూన్‌-అక్టోబరులో శుభాలు జరుగుతాయి. విష్ణువు, గణపతి ఆరాధన మేలు చేస్తాయి.


ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7

ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవడం మంచిది. కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. రాహువు అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాహువు సప్తమ సంచారం ప్రభావంతో భాగస్వామ్య వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. జూన్‌ 2 నుంచి గురువు మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ సమయంలో ఆచితూచి అడుగేయడం మేలు. గురువు అనుగ్రహం వల్ల ఆలోచనల్లో పరిణతి వస్తుంది. అక్టోబరు 31 తర్వాత, గురువు ధన స్థానానికి మారడంతో సంవత్సరాంతంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. గురుశ్లోక పఠనం, దత్తాత్రేయ దర్శనం మేలు చేస్తాయి.


ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 7; అవమానం 7

ఈ సంవత్సరం ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాదంతా అష్టమ శని ప్రభావంతో పనుల్లో జాప్యం ఉంటుంది. జూన్‌ 2 వరకూ గురువు లాభ స్థానంలో ఉండటం మీకు అనుకూలిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవబలం సహకరిస్తుంది. సమష్ఠి నిర్ణయాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో కలిసొస్తుంది. వ్యాపారం లాభదాయకం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సాయం అందుతుంది. జూన్‌ నుంచి గురువు ద్వాదశ సంచారం, రాహువు సప్తమ సంచారం వల్ల వైవాహిక జీవితంలోనూ కొంత తడబాటు ఉంటుంది. రాహువు షష్ఠంలో సంచరిస్తున్నందున, శత్రువులపైన సులభంగా విజయం సాధిస్తారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించాలి, రోజూ హనుమాన్‌ చాలీసా పఠించాలి.


ఆదాయం 8; వ్యయం 11, రాజపూజ్యం 3; అవమానం 3

ఈ ఏడాది విజయవంతంగా సాగిపోతుంది. రాహువు షష్ఠంలో ఉండటంతో కొత్త బలం వస్తుంది. శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు వ్యాజ్యాలూ, రుణ బాధల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. జీవిత ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీపరీక్షల్లో విజయాలు సాధిస్తారు. రాహువు డిసెంబరు నుంచి పంచమంలో ఉన్న కారణంగా పిల్లల మంచిచెడుల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. జూన్‌ 2 నుంచి అక్టోబరు 31 వరకూ గురువు లాభ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. దీనివల్ల ధనయోగం, పదోన్నతులు వరిస్తాయి. అక్టోబరు తర్వాత గురువు 12వ ఇంటికి వెళ్లడం వల్ల శుభకార్యాలు చేపడతారు. కేతువు డిసెంబరు వరకూ ద్వాదశంలో ఉంటూ మానసిక చైతన్యాన్ని తగ్గిస్తాడు. ఆ సమయంలో మనోబలంతో ఉత్సాహాన్ని పెంచుకోవాలి. గణపతి పూజ, రుద్రాభిషేకం మంచి చేస్తాయి.


ఆదాయం 5; వ్యయం 14; రాజపూజ్యం 6; అవమానం 3

ఈ ఏడాది మీ జీవితంలో అనేక విజయాలను సూచిస్తోంది. శని షష్ఠంలో సంచరించడంవల్ల నిర్ణయాలకు తిరుగు ఉండదు.రాజయోగం సూచితం. జూన్‌ 2 వరకు గురువు భాగ్య స్థానంలో ఉండటంతో తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశీయానానికీ, ఉన్నత విద్యలకూ తగిన సమయం. జూన్‌ నుంచి గురువు పదో ఇంటికి మారినా వృత్తిలో మాత్రం స్థిరత్వం ఉంటుంది.

ఈ దశలో ఏకాగ్రత చాలా అవసరం. కేతువు లాభ స్థానంలో ఉండటంతో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందుతారు. రాహువు పంచమ స్థానంలో ఉన్న కారణంగా, పిల్లల వికాసం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అక్టోబరు తర్వాత గురువు లాభ స్థానానికి చేరుకుంటాడు. దత్తాత్రేయ స్తోత్రం, గురుచరిత్ర పారాయణం మేలు చేస్తాయి.


ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6

ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నా, దైవబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. జూన్‌ 2 వరకు గురువు అష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులూ, ఆరోగ్య సమస్యలూ ఒత్తిడికి గురిచేస్తాయి. కానీ, జూన్‌ 2 నుంచి భాగ్య స్థానానికి రావడంతో, ఉచ్చస్థితి మొదలవుతుంది. శని పంచమంలో, రాహువు చతుర్థంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించే ప్రమాదం ఉంది. పిల్లల చదువులపైన దృష్టి పెట్టాలి. రాహువు తృతీయ స్థానంలో ఉండటం కలిసొచ్చే విషయం. కేతువు రాజ్యంలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో నిబద్ధత పెరుగుతుంది. కానీ గుర్తింపులో ఆలస్యం కావచ్చు. భాగ్య బృహస్పతి యోగం ఉత్తరార్ధంలో విద్యాపరమైన ఉన్నతిని ప్రసాదిస్తుంది. శివపూజ, రాహువు ధ్యానం శుభకరం.

 

ఆదాయం 14; వ్యయం 11, రాజపూజ్యం 5; అవమానం 6

అన్ని విధాలుగా అనుకూలమైన సంవత్సరం. గురుబలం వల్ల ఈ ఏడాది ప్రారంభం, చివరి భాగాల్లో మరింత మేలు జరుగుతుంది. శని చతుర్థ స్థానంలో ఉండటం (అర్ధాష్టమ శని) కొంతమేర ప్రతికూల ఫలితాలకు కారణం అవుతుంది. పని ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని విడిచిపెట్టకూడదు. వాహన వేగాన్ని నియంత్రించుకోండి. అయితే, రాహువు తృతీయంలో (పరాక్రమ స్థానంలో) ఉండటం కలిసొచ్చే విషయం. అదే రాహువు వాక్‌ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ప్రశాంతంగా సంభాషించాలి. శక్తికి మించిన వాగ్దానాలు చేయకండి. జూన్‌ 2 వరకూ గురువు సప్తమంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. గురుబలం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. జూన్‌ నుంచి గురువు ఎనిమిదో ఇంటికి మారడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబరు 31 తర్వాత గురువు తొమ్మిదో ఇంటికి మారడంతో పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి.

ఆదాయం 2; వ్యయం 8, రాజపూజ్యం 1; అవమానం 2

ఈ ఏడాది శని తృతీయంలో సంచరించడం వల్ల జీవితంలో మేలైన మలుపులు ఉంటాయి. గతంలోని కష్టాలకు ముగింపు దొరుకుతుంది. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. జూన్‌ 2 నుంచి అక్టోబరు 31 వరకూ గురువు సప్తమంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వివాహానికీ, దాంపత్య బంధానికీ అత్యంత అనుకూలమైన సమయం. వ్యాపారులకు లాభదాయకమైన సంవత్సరం. గురుబలం విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. రాహువు వాక్‌ స్థానంలో ఉండటం వల్ల, ఆచితూచి మాట్లాడటం మంచిది. ఒత్తిడిని దూరం ఉంచండి. శారీరక, మానసిక ఆరోగ్యాలు జాగ్రత్త. కేతువు సప్తమ స్థానం ప్రభావంతో ఆలూమగల మధ్య అపార్థాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. జూన్‌ వరకూ గురువు షష్ఠంలో ఉన్నందున, ముందుజాగ్రత్తగా పొదుపు-మదుపు పాటించడం మేలు. దుర్గాస్తోత్రం పఠించాలి, గణపతినీ, సుబ్రహ్మణ్యేశ్వరుడినీ పూజించాలి.
 

ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 4; అవమానం 2

ఈ ఏడాది సాధ్యమైనంత వరకూ సానుకూల ఫలితాలనే అందిస్తుంది. ఏలినాటి శని రెండో దశలో ఉండటం అనేది శారీరక, మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. జూన్‌ 2 వరకూ గురువు పంచమ స్థానంలో కొలువుదీరడం వల్ల పుష్కలమైన దైవానుగ్రహం అందుతుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు మరింత ఏకాగ్రతతో సాధన చేయాలి. జూన్‌ నుంచి గురువు ఆరో ఇంటికి వెళ్లడం రుణ సమస్యలకు ఆస్కారం కల్పిస్తుంది. శని ద్వితీయంలో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. షష్ఠ కేతువు శత్రువులపై విజయాన్ని అందిస్తాడు. అక్టోబరు తర్వాత గురువు ఏడో స్థానానికి రావడం ఊరటనిచ్చే పరిణామం. ఆంజనేయుడిని ఆరాధించాలి, నిత్యం రామనామాన్ని స్మరించాలి.

ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 2

ఈ సంవత్సరం ఆదాయంతోపాటు ఖర్చులూ అధికంగానే ఉంటాయి. ఈ ఏడాది ఏలినాటి శని (జన్మశని) ఉంది. ఆ ప్రభావాన్ని నిలువరించడానికి సకల జాగ్రత్తలూ తీసుకోవాలి. రాహువు ద్వాదశంలో సంచరించడం వల్ల నిద్రలేమి, దూర ప్రయాణాలు, వృథా వ్యయాలు తప్పకపోవచ్చు. తదుపరి దశలో, లాభ స్థానంలో రాహువు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. జూన్‌ 2 నుంచి అక్టోబరు 31 వరకూ... గురువు పంచమంలో ఉచ్చస్థితిలో సంచరించడం కలిసొచ్చే విషయం. సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో గురుబలం తగ్గుతుంది. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. దక్షిణామూర్తి స్తోత్రం, గురుగ్రహ శ్లోకం చదువుకోవాలి. విష్ణుమూర్తి ఆలయాల్ని సందర్శించాలి
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow