విద్యార్థులకు గుడ్ న్యూస్: కేజీబీవీల్లోనూ ఐఐటీ, నీట్ ‌‌‌‌‌‌ కోచింగ్‌‌‌‌‌‌‌‌..

వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే అమలు

జిల్లాకు మూడు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 93 గురుకులాలు ఎంపిక

ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు

ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్లు – మే 3న ఎగ్జామ్

మంచిర్యాల,  : ఇప్పటివరకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన ఐఐటీ, నీట్, క్లాట్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన కోచింగ్ ఇక నుంచి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) చదువుతున్న విద్యార్థినులకు కూడా అందించనున్నారు. ఈ కోచింగ్ అందించేందుకు జిల్లాకు మూడు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 93 కేజీబీవీలను ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఈ గురుకులాల్లో ఇంటర్ చదివే విద్యార్థినులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రత్యేక క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి విద్యార్థుల ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలు రాసిన బాలికలు ఎవరైనా ఎంట్రెన్స్ పరీక్ష రాసి సీటు పొందవచ్చు.

పేద బాలికలకు వరం

ఇప్పటివరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE)ల్లో మాత్రమే ఐఐటీ, నీట్, క్లాట్ కోచింగ్ అందించేవారు. తాజాగా ఈ విధానాన్ని కేజీబీవీల్లో కూడా ప్రవేశపెట్టడం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద బాలికలకు గొప్ప అవకాశంగా మారింది.

చాలా మంది బాలికలు ఐఐటీ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలు రాసి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలని ఆశపడుతున్నారు. కానీ సరైన కోచింగ్ లేకపోవడం వల్ల వారి కలలు నెరవేరడం కష్టమవుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో కోచింగ్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ కోర్సుల్లో చేరిపోతున్నారు.

ఇంటర్‌తో కోచింగ్

ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్‌తో పాటు ఐఐటీ, నీట్ కోచింగ్ అందిస్తారు. ఫస్ట్ ఇయర్‌లో ప్రారంభించి సెకండ్ ఇయర్‌లో పూర్తిగా ఈ పరీక్షలపైనే దృష్టి పెడతారు. ఇదే విధంగా కేజీబీవీల్లో కూడా ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, బైపీసీ వారికి నీట్, సీఈసీ మరియు ఇతర గ్రూపుల విద్యార్థులకు క్లాట్ కోచింగ్ ఇవ్వనున్నారు.

ఈ ప్రత్యేక కోచింగ్ కోసం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించనున్నారు. అవసరమైన ఫండ్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్లు

ఎక్స్‌లెన్స్ కేజీబీవీల్లో TG RJC SET 2026 ద్వారా అడ్మిషన్లు ఇవ్వనున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్లకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉంది. మే 3న పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ఒక్కో జిల్లాకు మూడు కేజీబీవీలను ఎంపిక చేశారు. ఒక్కో చోట ఒక్కోరకమైన కోచింగ్ అందించనున్నారు. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల కేజీబీవీలో ఐఐటీ, బెల్లంపల్లిలో నీట్, తాండూరులో క్లాట్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉండే అవకాశం ఉంది.

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కేజీబీవీ సెక్టోరియల్ ఆఫీసర్ కె. విజయలక్ష్మి కోరారు.

మరిన్ని వార్తలు...

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow