Telangana: రాత్రంతా తల్లి మృతదేహంపై పడి గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించిన రెండున్నరేళ్ల చిన్నారి..!

రంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన

రంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ ఊరి చివర నిర్మానుష ప్రాంతంలో రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి పక్కన ఓ రెండున్నరేళ్ల చిన్నారి బోరున విలపిస్తూ కనిపించింది.

ఎటుచూసినా చీకటి.. ఎంతకీ లేవని తల్లి.. ఏం చేయాలో తెలియక రాత్రంతా చిన్నారి గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. తెల్లవారుజామున చిన్నారి ఏడుపులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ హృదయాలను కదిలించిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం దేవునిపల్లి పరిధిలోని రంగారెడ్డిగూడలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతురాలిని రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31)గా పోలీసులు గుర్తించారు. పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.

మొదట్లో వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే అదే గ్రామానికి చెందిన నర్సింహులతో శోభకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త రాజుకు తెలియడంతో గొడవలు జరిగి ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి శోభ నర్సింహులతో సహజీవనం చేస్తోంది. వీరికి రెండున్నరేళ్ల పాప పుట్టింది.

నెలరోజుల క్రితం శోభ పిల్లలతో కలిసి తన తల్లిగారి ఇంటికి వచ్చింది.

ఏం జరిగింది?

శనివారం (మార్చి 21) నర్సింహులు శోభ కుమారుడికి సైకిల్ కొనిపిస్తానని చెప్పి షాద్‌నగర్‌కు రమ్మన్నాడు. కుమారుడిని వెంట పెట్టుకుని వచ్చిన శోభ సాయంత్రం వరకు అతని కోసం ఎదురు చూసింది. కానీ అతను రాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.

కుమారుడిని ఇంట్లో ఉంచి కుమార్తెతో కలిసి మళ్లీ కోయిలకొండకు బయలుదేరింది. అయితే ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో శోభ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.

ఆమె తలపై బండరాయితో మోదిన దుండగులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లితోపాటు ఉన్న రెండున్నరేళ్ల చిన్నారి రోదిస్తూ అక్కడే ఉండిపోయింది.

అటుగా వెళ్తున్న రైతులు చిన్నారి ఏడుపు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శోభ తల్లి కరుణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow