చిన్నారి మృతికి,ఘర్షణకు సంబంధం లేదు కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై మల్లు రవి


 నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతర వద్ద జరిగిన ఘర్షణకు, చిన్నారి మృతికి ఎలాంటి సబంధం లేదని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు.

ఆరోగ్య సమస్యతోనే మృతి చెందింది..

  • కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై మల్లు రవి


నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతర వద్ద జరిగిన ఘర్షణకు, చిన్నారి మృతికి ఎలాంటి సబంధం లేదని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తూ.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో గ్రామసభ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఈ ఘటన వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. జాతర వద్ద కొబ్బరికాయల ధరల విషయంలో గణేష్‌, శ్రీనివా్‌సరెడ్డి వర్గాల మధ్య ఫిబ్రవరి 18న ఘర్షణ జరిగిన మాట వాస్తవమేనని, అయితే.. పాప మృతి చెందింది మాత్రం 21న అని ఎంపీ వివరించారు. ఆ పాప నెలలు నిండకముందే జన్మించిందని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మృతి చెందిందని, ఘర్షణ జరిగిన సమయంలో పాప తల్లి అక్కడ లేదని పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత రాజకీయ ప్రేరేపణతో పాపను ఘర్షణలో చంపేశారని తప్పుడు ఫిర్యాదు చేశారని మల్లు రవి పేర్కొన్నారు. బాధిత మహిళ ఎస్సీ కాకపోయినా కావాలని ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు తిరుపతి రెడ్డి కలిసి ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక చిన్నారి మృతి అత్యంత బాధాకరమని, కానీ.. దాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు వాస్తవాలను అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow