యుద్ధం అక్కడ.. బాదుడు ఇక్కడ ! హైదరాబాద్‌‌లో ఇరానీ చాయ్, టిఫిన్స్‌‌పై రూ.20 వరకు రేట్లు పెంపు


 ఇరాన్‌‌‌‌ - ఇజ్రాయెల్ వార్‌‌ను సాకుగా చూపుతూ రేట్ల పెంపు

హోటల్స్‌‌లో అమాంతం పెరిగిన ఫుడ్ ఐటమ్స్ ధరలు

ఇరానీ చాయ్, టిఫిన్స్‌‌పై రూ.10 నుంచి రూ.20 వరకు..

హైదరాబాద్‌‌లో రూ.40 దాకా పెరిగిన సింగిల్ బిర్యానీ

డెలివరీ యాప్స్‌‌లో అదనపు బాదుడు..  బ్యాచిలర్స్, చిరుద్యోగులకు తిప్పలు

తెరపైకి సరికొత్త మోసం ‘శ్రింక్​ఫ్లేషన్’.. ధరలు పెంచకుండా క్వాంటిటీకి కత్తెర

హైదరాబాద్, ఎక్కడో జరుగుతున్న ఇరాన్ –  ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ ఇక్కడ రేట్లు పెంచేస్తున్నారు. పెట్రో, గ్యాస్, రవాణా చార్జీలు పెరుగుతున్నాయంటూ రిటైల్, హోల్‌‌సేల్ వ్యాపారులు, ఆఖరికి బహుళజాతి కంపెనీల ఔట్‌‌లెట్లలోనూ దోపిడీకి తెరతీశారు. 

హోటల్, రవాణా రంగం పైనే ఎక్కువ

గ్యాస్​దొరకడం లేదని, కమర్షియల్​సిలిండర్లకు ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తోందని, వంట నూనెల దిగుమతి సుంకం పెరిగిందని.. ఇలా రకరకాల సాకులతో హోటల్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్ రేట్లను అడ్డగోలుగా పెంచేశారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ముడిసరుకుల వ్యయం కేవలం ఐదు శాతం పెరిగితే.. హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు మాత్రం రాత్రికి రాత్రే 25 నుంచి 30 శాతం మేర రేట్లు పెంచాయి. రేటు మార్చుతూ పాత మెనూ కార్డులపై కొత్త స్టిక్కర్లు అంటించారు. ఇరానీ చాయ్ దగ్గరి నుంచి బిర్యానీ దాకా అన్నింటి ధరలూ పెంచేశారు. 


ఒక్కో ఇరానీ చాయ్​పై రూ.5 నుంచి రూ.10 దాకా పెంచడం గమనార్హం. ఇక సామాన్యుడి బ్రేక్ ఫాస్ట్ అయిన ఇడ్లీ, దోశ, వడ ధరలు ప్లేట్‌‌పై కనీసం రూ.10 నుంచి రూ.20 మేర పెంచారు. మొన్నటి వరకు రూ.120 నుంచి రూ.150కి దొరికే సింగిల్ బిర్యానీ ఇప్పుడు ఏకంగా రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగి రూ.200కు చేరింది. దీనికి తోడు ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ ఫీజుల పేరుతో ఆన్‌‌లైన్‌‌ ఫుడ్ డెలివరీ యాప్స్‌‌లో (స్విగ్గీ, జొమాటో వంటివి) అదనంగా మరో 20 నుంచి 30 శాతం వరకు బాదుతున్నారు. 


దీంతో అమీర్‌‌పేట, కూకట్‌‌పల్లి, దిల్‌‌సుఖ్‌‌నగర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గదులు అద్దెకు తీసుకుని, రోజువారీ భోజనం కోసం బయటి ఫుడ్‌‌పైనే ఆధారపడే లక్షలాది మంది విద్యార్థులు, చిరుద్యోగులు, బ్యాచిలర్స్ జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ దోపిడీ ఒక ఎత్తయితే.. భాగ్యనగరంలో సామాన్యుడి ప్రయాణాన్ని శాసిస్తున్న క్యాబ్, ఆటో అగ్రిగేటర్లు ఓలా, ఉబర్‌‌ బాదుడు మరో ఎత్తు. ముడిచమురు ధరల పెరుగుదల, ఇంధన ఖర్చులను సాకును చూపుతూ.. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. వాస్తవానికి స్థానికంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌‌జీ ధరల్లో మార్పులేమీ లేకపోయినా కనీస చార్జీలను అమాంతం పెంచేశాయి. ఒకప్పుడు కిలోమీటరుకు రూ.10 నుంచి రూ.15 వరకు ఉండగా, ఇప్పుడు ప్లాట్‌‌ఫామ్ ఫీజుల పేరుతో రూ.25 నుంచి రూ.30కి పెంచాయి.


రేటు అంతే.. క్వాంటిటీ తగ్గిస్తరు

నిత్యావసరాల ధరల పెంపు ఒక ఎత్తయితే, బహుళజాతి సంస్థలు, ఎఫ్ఎంసీజీ (నిత్యావసర వస్తు ఉత్పత్తి) కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాలు వినియోగదారులను ఏమారుస్తున్నాయి. ఒకేసారి ధరలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీలు ‘శ్రింక్‌‌ఫ్లేషన్’ అనే మోసానికి తెరలేపాయి. వస్తువు ధరను అలాగే ఉంచి, ప్యాకెట్లలోని పరిమాణాన్ని (క్వాంటిటీని) తగ్గించేయడమే శ్రింక్‌‌ఫ్లేషన్. ఇప్పటికే వివిధ కంపెనీలు వారం వ్యవధిలోనే ప్రొడక్షన్‌‌లో మార్పులు తీసుకువచ్చాయి. ఉదాహరణకు నిన్నటిదాకా వంద రూపాయలకే దొరికిన సబ్బు లేదా వాషింగ్ పౌడర్ ప్యాకెట్ ధర నేడు కూడా వంద రూపాయలే ఉన్నా, దాని బరువు మాత్రం 10 నుంచి 20 శాతం వరకు తగ్గిపోతుంది.


బిస్కెట్ ప్యాకెట్లు, స్నాక్స్, నూడుల్స్, టూత్ పేస్ట్‌‌లు, షాంపూలు, వంటనూనెల ప్యాకెట్ల విషయంలోనూ ఇదే దందా కొనసాగనుంది. టాస్క్‌‌ఫోర్స్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ దాడులు మచ్చుకైనా లేకపోవడం, ధరల నియంత్రణ కమిటీల పర్యవేక్షణ పూర్తిగా కొరవడడం వల్లే వ్యాపారులు ఇష్టా రాజ్యంగా రేట్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్కెట్లో వాస్తవ పరిస్థితిని సమీక్షించాలని.. కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెటింగ్‌‌కు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్​ కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow