ఘనంగా మాజీ మంత్రి చర్లకోలా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు.
నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు.
22 ఏళ్లుగా నిర్విఘ్నంగా రక్తదాన శిబిరాలు – రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో ముందంజ.
జడ్చర్ల మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి చర్లకోలా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు జడ్చర్ల నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహించారు. బాలానగర్ మండలం నుంచి ప్రారంభమైన వేడుకలు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్ రంగా గార్డెన్ వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి.
ఈ సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి గల్లీ వద్ద కేక్ కటింగ్‌లు, గజమాలలతో ఘనంగా సన్మానాలు నిర్వహిస్తూ లక్ష్మారెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, సామాజిక సేవలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు లక్ష్మారెడ్డి అని పలువురు పేర్కొన్నారు. ఏ కార్యకర్తకు, ఏ అభిమానికి కష్టం వచ్చినా “నేనున్నాను” అంటూ ముందుకొచ్చి సహాయం చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచిందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఏ విధంగా అయినా సహాయ సహకారాలు అందించడమే తన జీవిత లక్ష్యంగా లక్ష్మారెడ్డి పనిచేస్తున్నారని అభిమానులు కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటగా రాజీనామా చేసిన నాయకుల్లో లక్ష్మారెడ్డి ఒకరని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేశారు. ఉద్యమకాలం నుంచి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే… గత 22 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ అనేక ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడు లక్ష్మారెడ్డి. స్వయంగా డాక్టర్ అయిన ఆయనకు, ఒక ఆపరేషన్‌కు ఎంత రక్తం అవసరమవుతుందో తెలిసిన వ్యక్తి కావడంతో, రక్తదాన ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి ఈ సేవను ప్రారంభించారు.
తానే రక్తదానం చేయడమే కాకుండా, తన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కలిసి వేలాది మంది రక్తదానం చేసేలా ప్రోత్సహించారు. రాజకీయంగా ప్రజాసేవలోనే కాదు, ప్రాణదానంలోనూ డాక్టర్‌గా లక్ష్మారెడ్డి విజయం సాధించారని పలువురు అభిప్రాయపడ్డారు.
“ఒక నాయకుడిగా నువ్వు ఏమిచ్చావు?” అని ఎవరైనా ప్రశ్నిస్తే, గర్వంగా “నేను, నా అభిమానులు, నా కార్యకర్తలు ప్రజల కోసం రక్తాన్ని దానం చేశాం” అని చెప్పుకునే స్థాయికి ఆయన సేవలు నిలిచాయని నాయకులు అన్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఇలాంటి సేవా దృక్పథం ఉన్న నాయకులు రాజకీయాల్లో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. చర్లకోలా లక్ష్మారెడ్డి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి రక్తదాన శిబిరాలు మరెన్నో నిర్వహించి ప్రాణదాతగా నిలవాలని జేసీఎల్ న్యూస్ ప్రత్యేకంగా ఆకాంక్షించింది.