రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ కొరకు ఎంపిక చేసిన మైత్రీ ప్రింటింగ్ ప్రెస్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో కలిసి ఆమె ఆకస్మికంగా సందర్శించి ముద్రణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2 వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ అనంతరం అర్హత గల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం.. ఎన్నికల గుర్తులు కేటాయించడం జరిగిందన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో 347 మంది, భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని 10 వార్డులలో 41 మంది, దేవరకద్ర మున్సిపల్ పరిధిలోని 12 వార్డులలో 40 మంది అభ్యర్థులతో సహా ఎన్నికల బరిలో మొత్తం 428 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించడం జరిగిందని, ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం బ్యాలెట్ పేపర్ల ముద్రణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఫిబ్రవరి 11 న పోలింగ్, 12 న అవసరమైతే రీపోలింగ్ 13 న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రామానుంజుల రెడ్డి, బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ నోడల్ అధికారి డిఆర్డీఓ నర్సింహులు, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, ఉద్యాన శాఖ డిడి వేణుగోపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags
mahabubnagar