3వ వేదీన నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వెంటనే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో స్టిక్కర్లతో పాటు బ్యాడ్జీలు ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కరపత్రాలు తయారు చేసుకొని ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే ఏకంగా ఓటర్ల కాళ్లకు మొక్కుతూ వేయాలని వేడుకుంటున్నారు. ఒకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే మంగళవారం రాత్రికి రాత్రే ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా ఆటోలు, మైక్‌లను ఏర్పాటు చేసుకొని వార్డులు, డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. డీజే పాటలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పాటలతో హోరెత్తుతున్న ప్రచారం
ప్రధాన హార్షల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు అనేకమంది తమ పేరిట పాటలను తయారు చేయించుకున్నారు. కళాకారులు పెద్దఎత్తున ముందుకు వచ్చి తక్కువ ధరకే అంటే ఒక పాటకు రూ. 10వేలు ఇస్తే ఆయా అభ్యర్థుల పేరిట పాడుతూ కళాకారులు ఉపాధి పొందుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆయా పాటలతో వార్డు, డివిజన్లలో దిగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొంటున్న వారికి ఒక్కొకరికి రూ.400 వరకు చెల్లిస్తున్నారు. మరో ఐదు రోజులు పాటు ప్రచారం ఉండటంతో వారికి ఉపాధి లభించనుంది. ఈ డబ్బులు ఇంటి అద్దెలతోపాటు కుటుంబ అవసరాలకు సమకూరుతుండటంతో ఆయా వార్డులు, డివిజన్లలో మహిళలు, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
Tags
Telagana