జడ్చర్ల: ఆగి ఉన్న లారీని వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ శివారులో, ఆశ్రమం వద్ద గల **జాతీయ రహదారి 167**పై చోటుచేసుకుంది.
మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామానికి చెందిన బోయ శివ (26), బోయ రజిని (26) తమ పని నిమిత్తం రాణిపేట గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై జడ్చర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై ఆశ్రమం వద్ద నిలిపి ఉంచిన లారీని వారి వాహనం వెనుక నుండి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బోయ శివ అక్కడికక్కడే మృతి చెందగా, రజినికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రజినిని 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, మృతుడు శివ ఇటీవలే శివమాల ధరించి, మహాశివరాత్రి సందర్భంగా శివ దీక్షను ముగించుకొని ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపధ్యంలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతుడు శివకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జడ్చర్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.