Scorpion Farming: తేళ్లతో కోట్లు కురిపించే వ్యాపారం.. ఇందుకు మీరు ఏం చేయాలంటే?
తేలు (Scorpion) చాలా ప్రమాదకారి. తోకతో ఒక్కటిచ్చిందంటే చాలు.. ప్రాణం పోతుంది. ఎందుకంటే దాని విషం అంత పవర్ ఫుల్. అయితే, మన పరిశోధకులు.. ఆ ప్రమాదంలోనే ప్రాణం పోసే పవర్ ఉందని కనుగొన్నారు. అదేనండి.. తేలు విషంలో ఎన్నో ఔషద గుణాలు దాగి ఉన్నాయట. ఇప్పటికే దాన్ని పలు చికిత్సల కోసం వాడేస్తున్నారట. ఆ విషాన్ని సేకరించి ఇచ్చేవారికి రూ.కోట్లు కూడా చెల్లిస్తున్నారట. ‘‘మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే తేళ్లను పెంచేసి కోటీశ్వరులం అయిపోదాం’’ అని అనుకుంటున్నారా? ఆగండి.. ఆగండి.. అదేమీ తేనెటీగల పెంపకం కాదు. తేళ్ల పెంపకం. తేడా వస్తే.. చావే. అంతేకాదు.. వాటిని పెంచడానికి, విషాన్ని సేకరించడానికి చాలా రూల్స్ ఉన్నాయ్. ముఖ్యంగా మన ఇండియాలో ఇందుకు అనుమతి లభించడం అంత ఈజీ కాదట. అయినా సరే.. ట్రై చేస్తాం అంటే, ఇవిగో ఈ వివరాలు చదివేయండి.హాహ్.. షాకయ్యారా? ఔనండి.. ఒక గ్యాలన్ తేలు విషం రూ.3,534 కోట్లు పలుకుతుందట అమెరికా వంటి దేశాల్లో. అంటే మనం కనీసం ఒక గ్రాము తేలు విషాన్ని సేకరించినా లక్షాధికారులం అయిపోవచ్చు. ఎందుకంటే.. ఒక గ్రాము రూ.93 లక్షలు పలుకుతుంది. 100 గ్రాములు కలెక్ట్ చేస్తే సుమారు రూ.93 కోట్లు లభిస్తాయి. ఏడాదికి కనీసం ఒక లీటర్ తేలు విషాన్ని సేకరిస్తే రూ.933.47 కోట్లు మీ సొంతం అవుతాయి. కానీ, అన్నితేళ్ల విషం దీనికి పనికిరాదు. కేవలం ఒక జాతికి చెందిన తేళ్లకే ఎక్కువ డిమాండ్. అవి కానీ మీకు దొరికాయంటే.. పండగే. కానీ, దానికి కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
ఈ తేళ్లకే ఎక్కువ డిమాండ్
‘డెత్‌స్టాల్కర్ స్కార్పియన్’ అనే తేలు విషానికి ప్రపంచంలో బాగా డిమాండ్ ఉందట. అయితే, ఈ జాతి తేళ్లు ఇండియాలో పెరగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తేళ్లు హోటెన్టోటా టములస్ (Hottentotta tamulus) జాతికి చెందిన తేళ్లు ఎక్కువగా ఉంటాయి. వాటి విషం ఔషదాలకు పనికిరాదు. వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ‘డెత్‌స్టాల్కర్ స్కార్పియన్’ రకం తేళ్లు ఎక్కువగా అల్జీరియా, ఈజిప్ట్, లిబియా, మాలీ, నైజర్, సూడాన్, ట్యూనీషియా, ఎథియోపియా, సోమాలియాలో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సహారా ఎడారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా ఇజ్రాయెల్, జోర్డాన్, సౌది అరేబియా, యూఏఈ, ఒమన్, యెమెన్, ఇరాన్, టర్కీ, సిరియా, లెబనాన్, కువైట్‌లో కూడా ఉంటాయి. ముఖ్యంగా అరేబియన్ ఎడారిలో ఈ తేళ్లు పెరుగుతుంటాయి.
ఈ విషం ఎందుకంత ఖరీదు?
ఈ విషాన్ని ఔషదాల్లో వాడతారు సరే.. కానీ, దానికి అంత చెల్లించడం అవసరమా అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే, ఆ తేళ్లను పెంచడం, వాటి నుంచి ఔషదాన్ని సేకరించడం అంత ఈజీ కాదు. ఒక్క తేలు నుంచి ఒక్కసారే 2 మిల్లీ గ్రాముల విషం వస్తుంది. కొన్ని చోట్ల దీన్ని చేతితో తీస్తారు. అది చాలా ప్రమాదకరం. ప్రాణాలు పోతాయి. అందుకే కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ విధానంలో విషాన్ని తీస్తున్నారు. ఒక గ్యాలన్ (3.785 లీటర్లు) విషాన్ని సేకరించాలంటే.. కొన్ని లక్షల స్కార్పియన్లు అవసరం. అందుకే, దీని సరఫరా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు నైజీరియా, అబుదాబి, ఈజిప్టులోని న్యూ వాలీ ప్రాంతాల్లోనే ఈ తేళ్లను పెంచుతున్నారు. అక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్‌కు విషాన్ని ఎగుమతి చేస్తున్నారు. న్యూ వాలీలో మాత్రం ఒకే వ్యక్తి ఈ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ తేనె విషాన్ని ఏయే చికిత్సలకు ఉపయోగిస్తారు?
తేళ్ల విషంలో ఉండే ప్రోటీన్లు, పెప్టైడ్లు అనే బయోయాక్టీవ్ కాంపౌండ్స్.. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడతాయి. అలాగే యాంటీమైక్రోబయల్ (బ్యాక్టీరియా నిరోధకం), మలేరియా నివారణల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే నొప్పి తగ్గించే మందులు(పెయిన్ కిల్లర్స్)లో కూడా వాడుతున్నారు. ఇంకా ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో ఈ విషాన్ని ఉపయోగిస్తారు. అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ‘బయోకెమికల్ గోల్డ్‌మైన్’ అని అంటారు. అయితే, ఈ విషాన్ని నేరుగా ఉపయోగించారు. ఇందుకు మరికొన్ని శాస్త్రీయ విధానాలు ఉంటాయి. అయితే, డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో కొన్ని ల్యాబ్స్‌లో ప్రత్యామ్నాయంగా మాలిక్యూల్స్‌ను సింథటిక్ రూపంలో తయారు చేస్తున్నారు.
ఇండియాలో ఈ తేళ్లను పెంచలేమా?
ఇండియాలో వీటిని పెంచాలంటే కొన్ని సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. మీకు కోట్లలో ఆదాయం రావాలంటే.. లక్షలాది తేళ్లను సేకరించాలి. అయితే, ఆ జాతికి చెందిన తేళ్లు మనకు ఇండియాలో దొరకవు. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అయితే, అవి ఇక్కడి వాతావరణంలో బతకగలవో లేదో చెప్పలేం. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే, వాటి నుంచి విషాన్ని సేకరించడం ప్రమాదకరం. అందుకు ప్రత్యేకమైన యంత్రాలను వాడాలి. కొంచెం తేడా వచ్చిన సేకరించేవారి ప్రాణాలు పోతాయి. మరో విషయం ఏమిటంటే.. తేళ్లను పెంచడానికి మన అటవీ చట్టాలు అంగీకరించవు. కాబట్టి, దానికి సంబంధించి చట్టంలో ఏయే రూల్స్ ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. అన్నీ అనుకూలంగా ఉంటే.. చట్ట ప్రకారం తేళ్ల ఫారం ఏర్పాటు చేయాలి. విషం సేకరణ, స్టోరేజ్, అమ్మకం కోసం అటవీ శాఖ, డ్రగ్స్-కాస్మెటిక్స్ రెగ్యులేటరీ అథారిటీ (CDSCO) లేదా డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా చేస్తే జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి, ముందుగా మీరు ఆయా డిపార్ట్‌మెంట్ అధికారులను సంప్రదించి రూల్స్ తెలుసుకోండి.
విషాన్ని ఎలా సేకరిస్తారు?
ముందుగా ఫార్మ్ సెటప్ చేసుకోవాలి. అక్కడే తేళ్లను పెంచుకోవాలి. అయితే, వాటి నుంచి విషాన్ని సేకరించేందుకు సేఫ్టీ విధానాలు పాటించాలి. ఇందుకు ట్రైనింగ్ తప్పనిసరి. ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ద్వారా విషాన్ని సేకరించాలి. దీనికి కూడా ట్రైనింగ్ అవసరం. తేళ్లు కాటువేసే ప్రమాదం ఉంది. ఒక తేలు నుంచి నెలకు ఒకసారి మాత్రమే విషం సేకరించాలి. వెంట వెంటనే సేకరించే విషంలో ఔషదాలకు అవసరమైన ప్రోటీన్స్ ఉండవు. అవి మళ్లీ తయారీ కావాలంటే కనీసం 25 రోజులైన టైమ్ పడుతుంది.
పౌడర్ రూపంలోనే స్టోర్ చేయాలి
విషాన్ని సేకరించిన తర్వాత.. ల్యాబ్‌కు పంపి.. ప్యూరిటీ, క్వాలిటీ టెస్టులు చేయించాలి. మంచిగా ఉంటే దాన్ని పౌడర్ రూపంలో స్టోర్ చేస్తారు. ద్రవరూపంలో ఉండే విషాన్ని ఎవరూ కొనరు. వీటిని కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు మాత్రమే కొనుగోలు చేస్తాయి. క్యాన్సర్, పెయిన్ కిల్లర్స్ తయారీకి పరిశోధనలు చేసే కంపెనీలు మాత్రమే తీసుకుంటాయి. ఫార్మింగ్‌కు ముందే వారితో మీరు ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా క్లిష్టమైనది. అయితే, అతిగా డబ్బుకు ఆశపడి గ్యాలన్ల కొద్ది విషాన్ని సేకరించకూడదు. ఎంత సేకరిస్తే అంత.. ఫ్రెష్‌గా ల్యాబ్‌లకు ఇచ్చేయాల్సిందే.