Earth Age: భూమికి వయసైపోయిందా? ఇంకా ఎన్నేళ్లు టైమ్ ఉంది? ఆ తర్వాత ఏమవుతుంది?


 బాగా వయస్సు ముదిరిన వారిని.. ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టాడని ఆట పట్టిస్తారు కొందరు. అయితే, వారిలో చాలామందికి భూమి ఎప్పుడు ఎలా పుట్టిందో కూడా తెలీదు. కానీ, భూమి వయస్సు చాలా ఎక్కువని మాత్రం తెలుసు. ఇక అసలు విషయానికి వస్తే.. భూమికి ఇప్పుడు వయస్సు అయిపోతుంది. మనిషి 50 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టగానే.. వృద్ధాప్యం మొదలైపోతుంది. ప్రస్తుతం భూమిది కూడా అదే పరిస్థితి.. భూమి పుట్టి సుమారు 4.5 మిలియన్ ఏళ్లు అయిపోతోంది. ఇంకా మరో 4 మిలియన్ లేదా 5 మిలియన్ ఏళ్లు మాత్రమే భూమి మనుగడలో ఉండవచ్చని అంచనా. అది కూడా సూర్యుడు దయ చూపితేనే.. లేకపోతే ఖతం అంటున్నారు పరిశోధకులు. 

భూమికి ప్రత్యామ్నాయం అవసరమా?

మనం జీవించడానికి అనుకూలంగా ఉన్న భూమి ఉండగానే.. ఇతర గ్రహాల్లో ‘జీవం’ కోసం వేట మొదలుపెట్టారు మన పరిశోధకులు. అయితే, వారి ప్రయత్నాలు చూసి మనం పిచ్చోళ్లని అనుకోవచ్చు. కానీ.. వారు చేసేది కూడా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడు మనం జీవిస్తున్న భూమికి ప్రత్యామ్నాయం కనుగోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఇప్పటికే భూమిపై వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. విపత్తులు, వ్యాధులు భయపెడుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల భవిష్యత్తులో ఇంకా ఎన్నో అనార్థాలను చూడాల్సి రావచ్చు. కాబట్టి భూమికి ప్రత్యామ్నాయంగా.. జీవించడానికి అనుకూలంగా ఉన్న మరో గ్రహాన్ని కనుగొంటే.. కొంతమందైనా అక్కడికి వెళ్లి బతికి బట్టకట్టవచ్చు. అయితే, ఇదంతా మనకు సైన్స్‌ఫిక్షన్ మూవీలా అనిపించవచ్చు. అది సాధ్యమేనా అనే సందేహాలు కూడా రావచ్చు. అయితే, ఆ ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇప్పుడు తెలియాల్సిందల్లా.. ఏయే గ్రహాలపై జీవించడానికి తగిన వాతావరణం ఉందనేది తెలుసుకోవడమే.

ఇక సూర్యుడి పైనే భారం?

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దానివల్లే పగలు.. రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. ఈ రొటీన్ ప్రక్రియాలో ఏ చిన్న తేడా వచ్చినా ఆ ప్రభావం భూమిపై ఉండే సమస్త జీవులపై పడుతుంది. అయితే, మనకు తెలియకుండానే భూమిపై కొన్ని మార్పులు జరుగుతున్నాయి. భూమి ఇప్పటికే 4.5 బిలియన్ ఏళ్లు పూర్తి చేసుకుంది. మరో 5 బిలియన్ ఏళ్ల వరకు జీవించడానికి అనుకూలంగా ఉండవచ్చు. కానీ, ఇప్పటికే భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో సూర్యుడి ప్రభావం భూమిపై మరింత పడనుంది. వేడి తీవ్ర పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న పచ్చని అడవులు కనుమరుగు కావచ్చు. ఒక బిలియన్ ఏళ్లలో మనుషులు, ఇతర జీవుల మనుగడ కష్టం కావచ్చు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

భూమి వయస్సును ఎలా కనుగొన్నారు?

భూమి పుట్టే సమయానికి.. అసలు జీవుల మనుగడే లేదు. అలాంటిది భూమి ఎప్పుడు ఎలా పుట్టిందనేది మనుషులకు ఎలా తెలుస్తుందనేగా మీ సందేహం. భూమిపై లభించిన కొన్ని పురాతన రాళ్లు, ఉల్క శిథిలాల ద్వారా శాస్త్రవేత్తలు భూమి వయస్సును కనుగొన్నారు. భూమిలో ఉన్న కొన్ని రాళ్లలో రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. అవి చాలా నెమ్మదిగా కాలంతోపాటు మారుతుంటాయి. ఆ మార్పు ఆధారంగా శాస్త్రవేత్తలు ఆ రాళ్లు ఎంత పాతవనేవి తెలుసుకుంటారు. కేవలం భూమి మీద ఉన్న రాళ్లనే కాదు. భూమిపై రాలిన ఉల్కల వయస్సును కూడా తెలుసుకున్నారు. వాటి వయస్సు కూడా భూమికి ఉన్నంత వయస్సే ఉండటంతో ఆశ్చర్యపోయారు. ఆ ఉల్కలు కూడా భూమితోపాటే ఏర్పడ్డాయని తెలుసుకున్నారు. వాటి వయస్సు.. 4.54 బిలియన్ (454 కోట్లు) ఏళ్లు ఉండవచ్చని అంచనా వేశారు. క్లేర్ ప్యాటర్సన్ అనే శాస్త్రవేత్త 1956లో మొదటిసారి ఈ పరీక్షలు నిర్వహించి భూమి వయస్సును ఖచ్చితంగా అంచనా వేశారు. దాని ప్రకారం.. భూమికి ఇప్పుడు సగం వయస్సు అయిపోయింది. వాతావరణ మార్పులు, సూర్యుడి ప్రభావం వంటివి వయస్సు మీద పడినవారికి వచ్చే రోగాలు, వైరస్ లాంటివి. వాటి ప్రభావం పైనే.. జీవుల మనుగడ కూడా ఆధారపడి ఉంటుంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow