కాలుకి చిన్న ముల్లు గుచ్చుకుని అలా ఉండిపోతేనే.. అప్పుడప్పుడు చివుక్కు చివుక్కు మంటూ ప్రాణం తీసేసినంత పని అవుతుంటుంది. అలాంటింది.. ఐదేళ్లుగా కడుపులో కత్తెర ఉండటం వినటానికే భయమేసే వార్త ఇది. పాపం ఆ మహిళ ఐదేళ్లుగా కడుపులో ఉన్న కత్తెరను ఎలా మోసిందో ఏమో గానీ.. సడెన్ గా ఎక్కువైన నొప్పితో హాస్పిటల్ కు వెళితే.. స్కానింగ్ చేసిన డాక్టర్లు కడుపులో కత్తెర చూసి షాక్ కు గురయ్యారు.
కేరళలో ఐదళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకున్న ఒక మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారు డాక్టర్లు. కడుపు నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లగా.. ఏదో బయటి వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అది కత్తెర అని తేలడం ఆశ్చర్యానికి గురిచేసింది.
అలపూజ జిల్లాలోని వందనం ఏరియాలో ఉన్న అలపూజా మెడికల్ కాలేజీలో ఉష జోసెఫ్ అనే మహిళ 2021 మే నెలలో ఆపరేషన్ చేయించుకుంది. సర్జరీ తర్వాత అబ్డామినల్ పెయిన్ తో తన తల్లి బాధ పడుతుండేదని ఆమె కొడుకు షిబిన్ చెప్పాడు. నొప్పి వస్తుందని అదే హాస్పిటల్ కు ఎన్ని సార్లు వెళ్లినా.. కిడ్నీ నొప్పి అయ్యుంటుందని మందులు ఇచ్చి లైట్ తీసుకున్నారని తెలిపాడు.
డాక్టర్లు ఎన్నిసార్లు వెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లినట్లు చెప్పాడు. అక్కడ తీసిన ఎక్స్ రేలో కడుపులో వేరే వస్తువు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపాడు. బాడీలో కత్తెర మరిచిపోయినట్లు గుర్తించి సర్జరీ చేసి బయటకు తీసినట్లు చెప్పాడు. తమకు జరిగిన నష్టాన్ని సదరు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ను సంప్రదిస్తే.. తాము ఎలాంటి సహాయం చేయలేమని చెప్పినట్లు తెలిపాడు. ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరించినట్లు చెప్పాడు. ఈ అంశంపై కేసు పెట్టనున్నట్లు శిబిన్ చెప్పాడు.
గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రిటైర్డ్ సర్జన్ డా.లలితాంబికా ఈ అంశంపై స్పందించారు. నేను రిటైర్ అయ్యే ముందు ఈ సర్జరీ జరిగింది. కానీ నేను ఆ సర్జరీ టీమ్ లో లేను. యూనిట్ చీఫ్ గా నా పేరు రికార్డ్ లో నమోదైంది. కోవిడ్ టైమ్ లో జరిగిన ఈ సర్జరీలో నేను లేను.. అని ఆమె బదులిచ్చారు. సర్జరీకి ముందు పేషెంట్స్ తో డబ్బులు తీసుకుంటారనే ఆరోపణలను ఆమె ఖండించారు.
ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేరళ ప్రభుత్వ ఆస్పత్రులలో జరుగుతున్న అవినీతితపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. నిర్లక్ష్య వైఖరితో మహిళ కడుపులో కత్తెర మరిచిపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కడుపులో ఉన్న కత్తెర ను పరీక్షించాల్సిందిగా డా.లలితాంబికా చెప్పారు. ఉషా జోసెఫ్ కు అంతకు ముందు కూడా సర్జరీ జరిగిందని.. అది ఎప్పటిదనేది తేల్చాల్సి ఉందన్నారు. కడుపులో కత్తెర కనీసం 20 నుంచి 30 ఏళ్ల వరకు పాడవకుండా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.