హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. వాహనం కొన్న డీలర్ పాయింట్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రయోగం శుక్రవారం విజయవంతమైంది. వాహనదారులకు మరింత సౌలభ్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8న విధానపరమైన నిర్ణయం తీసుకోగా, అధికారులు సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో నూతన ఆన్‌లైన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. షోరూమ్‌లో ఫోర్ వీలర్ కొనుగోలు చేసిన వాహనదారుడికి సంయుక్త రవాణా కమిషనర్(జేటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ రిజిస్ట్రేషన్ పూర్తిచేసి పత్రాల్ని అందించారు.
సమయం ఆదా, వేగంగా సేవలు
కొత్త విధానంతో వాహన కొనుగోలుదారులకు సమయం ఆదా కానుంది. రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన వ్యయప్రయాసలు ఉండవు. వాహనం విక్రయించిన డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. రవాణాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఉదయం కొనుగోలు చేసిన వాహనానికి సాయంత్రంలోగా శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది. సాయంత్రం కొనుగోలు చేస్తే మాత్రం మరుసటి రోజు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
కొత్త విధానంలో ఇలా...
- అవసరమైన పత్రాలు(ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, అడ్రస్ ప్రూఫ్, వాహన ఫొటోలు మొదలైనవి) డీలర్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు.
- రవాణాశాఖ అధికారి ఆ దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు.
- ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్‌సీ) నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా వాహన యజమానికి వెళుతుంది.
అవసరాన్ని బట్టి తనిఖీలు
శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పరిశీలనకు అవసరమైతే డీలర్ల షోరూముల్లో తనిఖీలు జరుపుతామని రవాణా శాఖ తెలిపింది.
- నూతన రిజిస్ట్రేషన్ విధానం ద్విచక్ర వాహనాలు, కార్లకు మాత్రమే వర్తిస్తుంది.
- వాణిజ్య(ట్రాన్స్‌పోర్ట్) వాహనాల రిజిస్ట్రేషన్ గతంలో మాదిరే ఆర్టీఓ కార్యాలయాల్లోనే ఉంటుంది.
- నూతన విధానం అమలు ప్రక్రియపై రవాణాశాఖ కమిషనర్ 33 జిల్లాల అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు.
Tags
Hyderabad