Dairy Industry: రూ.2 కోట్ల జీతం వదిలి.. పాల వ్యాపారం!


 అతడు చిన్ననాటి నుంచి కలలు కన్న కొలువులో ఉన్నాడు. చక్కగా ఏడాదికి రూ.2.02 కోట్ల జీతం. అంతా బాగుంది అనుకున్న సమయంలో కుటుంబ పరిస్థితులు తలకిందులయ్యాయి. రకరకాల సమస్యలతో ఊరి జనం తన కుటుంబాన్ని దూరం పెట్టారు. అది తట్టుకోలేని అతడు.. ఎక్కడో కాదు, సొంతఊళ్లోనే తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఉన్న ఉద్యోగం వదిలి వ్యాపారానికి సిద్ధమయ్యాడు. అతి తక్కువ కాలంలోనే అంతకంటే ఎక్కువ సంపాదించే స్థాయికి ఎదిగాడు!

తాటిపర్తి సతీష్‌రావుది ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం వెల్తుర్లపల్లి గ్రామం, వ్యవసాయాధారిత కుటుంబం. సతీష్‌రావు చిన్నతనంలో తల్లిదండ్రులు వ్యవసాయంలో సరిగా దిగుబడులు రాక పూర్తిగా నష్టపోయారు. అయినా ముగ్గురు పిల్లల చదువులను ఏనాడూ ఆపలేదు. సతీష్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో పదో తరగతి పూర్తి చేశాడు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ అనంతరం వరంగల్‌ ఎన్‌ఐటీలో ఎమ్మెస్సీ చేశాడు.

ఆపైన అమెరికాలో మాస్టర్స్‌ చేసేందుకు స్కాలర్‌షిప్‌తో సహా సీటు రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు. అక్కడే ఫైజర్‌ కంపెనీలో స్టాటిస్టికల్‌ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం సాధించాడు. తొలుత రూ.85 లక్షలతో జీతం మొదలైంది. ఆ తర్వాత పలు కంపెనీలు మారాడు. వేతనం పెరిగింది. అయినా సంతృప్తి చెందలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇవ్వడం కల. అదే సమయంలో గ్రామంలో వారి కుటుంబానికి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఎలాగైనా ఊర్లోనే స్థిరపడి తలెత్తుకుని తిరగాలి అనుకున్నాడు. డెయిరీ పరిశ్రమ మదిలో మెదిలింది. దాంతో అమెరికాలో చాలా డెయిరీలను సందర్శించాడు. వీకెండ్స్‌లో అక్కడికి వెళ్లి కొత్త విషయాలు నేర్చుకున్నాడు. ఆ సమయానికి తన జీతం రూ.2.02 కోట్లు.. తోటి స్నేహితులు ‘మంచి జీతం ఉంది ఇక్కడే ఉండొచ్చు కదా’ అన్నారు. అయినా లక్ష్యాన్ని వీడలేదు. 2023లో ఊరికి వచ్చేశాడు.

అప్పుడే మొదలు

రెండు నెలలు ఇంట్లో ఉంటూ.. వర్క్‌ ఫ్రం హోం చేశాడు. ఈ సమయంలో తన డెయిరీ ఫాం ప్రాజెక్టు గురించి బ్యాంకులకు వెళ్లి మేనేజర్లకు వివరించేవాడు. ‘అమెరికాలో కోట్ల జీతం వస్తుందంటున్నావు.. అదంతా వదిలేసి ఇది సాధ్యమవుతుందా?’ అన్నవారే ఎక్కువ. ఇంకొందరైతే ‘మీ ఇంట్లో వాళ్లని తీసుకురా’ అని కూడా చెప్పారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పటికే డెయిరీ కోసం తన దగ్గర ఉన్న డబ్బుతో 22 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. చివరికి ఓ బ్యాంకు తన ప్రాజెక్టును ఒప్పుకొని రూ.4 కోట్ల రుణం మంజూరు చేసింది. 

2024లో నాలుగెకరాల్లో రెండు షెడ్లు వేసి మొదట పంజాబ్‌ నుంచి వంద గేదెలు తీసుకొచ్చాడు. ప్రస్తుతం మరో వంద గేదెలు తీసుకురావడంతో.. వాటి సంఖ్య 200కు చేరింది. డెయిరీ ఫాంకు ఒక మేనేజర్, సూపర్‌వైజర్, పది గేదెలకు ఒకరు చొప్పున మనుషులను ఏర్పాటు చేశాడు. ఎలాంటి యంత్రాలు వాడకుండా సంప్రదాయ పద్ధతిలో పాలు తీస్తున్నారు. రోజుకు 900 నుంచి 950 లీటర్ల పాలు వస్తున్నాయి. ఈ పాలను నేరుగా ‘నేచర్‌ డెయిరీ ఫాం’ పేరుతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గణపురం, మంజూనగర్, భూపాలపల్లిలో మొత్తం నాలుగు అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. డెయిరీ ఫాం, అవుట్‌లెట్లలో కలిపి మొత్తం 28 మంది పనిచేస్తున్నారు. మరో 25 మంది వరకూ పాల ఉత్పత్తుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. నెలకు పాతిక లక్షల వరకూ వస్తోంది! సొంత వ్యాపారాలు చేయాలనుకునే యువతకు సతీష్‌ అనుభవం ఓ చక్కని పాఠం. 
పురుషోత్తం గుళ్లెపెళ్లి, వరంగల్‌ 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow