Vasantha Panchami: వాగ్దేవికి.. ‘అక్షరాంజలి’!


వాక్కుకు, విద్యకు, కళలకు అధిష్టాన దేవతగా, జ్ఞానస్వరూపిణిగా సరస్వతీదేవిని దర్శింపజేశాయి మన పురాణాలు. వేదాలు, ఉపనిషత్తుల్లో చదువులతల్లిని ఒకే తత్వంగా అనేక రూపాల్లో ప్రతిష్టించడం జరిగింది.

కల విద్యాప్రదాయని, జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీమాత మాఘ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించిందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ‘జంతూనామ్‌ నర జన్మ దుర్లభం’ అన్నారు ఆదిశంకరాచార్య. మనిషికి మాత్రమే ఆలోచించే, మాట్లాడగలిగే శక్తి ఉంది మరి. అలా మాట్లాడాలంటే విద్యలకు అధిదేవత, వాగ్రూపిణి అయిన సరస్వతీదేవి కటాక్షం మనకెంతో అవసరం. సరస్వతీమాతను పరాశక్తి రూపాల్లో ఒకటిగానే పేర్కొంది దేవీభాగవతం. ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణాలతో మూగవాడైన మూక శంకరుడు, నిరక్షర కుక్షి అయిన కాళిదాసు మహాకవులయ్యారు. 

సరస్వతీ అమ్మవారిని అహింసాదేవిగా బ్రహ్మవైవర్త పురాణం వర్ణించింది. ఆమె చేతిలో యుద్ధం చేసే ఆయుధాలు కనిపించవు. ఆ దేవికి రక్తపూరితమైన బలులు సమర్పించరు. పూజించే సందర్భాల్లో పుస్తకాలను, సంగీత వాయిద్యాలను ఆ దేవి ఎదుట ఉంచుతారు. సరస్వతీదేవి చేతుల్లోని వీణ సంగీతానికి, పుస్తకం వేద విజ్ఞానానికి, అక్షమాల తపస్సుకు చిహ్నాలు. హంస వాహనం వివేకానికి గుర్తు. ఈ వర్ణన స్వచ్ఛతకు, సృజనాత్మకతకు సంకేతం.

స్తుతించాకే రచించారు..

జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి ఆవిర్భవించిన విశిష్ట దినాన్నే శ్రీపంచమి, వసంత పంచమి, మదన పంచమి పేర్లతో పిలుచుకుంటాం. అమ్మ ప్రణవ రూపాన్ని- ‘మల్లె, మంచు, చంద్రబింబం, ముత్యాల్లా స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి వీణాపాణిగా, తెల్ల తామరపై ఆసీనురాలైన ఓ సరస్వతీదేవీ! మా అజ్ఞానాన్ని తొలగించి మమ్ము రక్షించు’ అంటూ పూజించారు. ‘చందన, కర్పూర పరిమళాలతో వెలుగొందుతూ సూర్యుడిలా ప్రకాశించే మహిమగల తల్లీ మమ్ము అనుగ్రహించు’ అన్నాడు భక్తకవి పోతన. ఇలా ఎందరో కవులు సరస్వతీమాతను ప్రార్థించిన మీదటే తమ కావ్యాలను కొనసాగించారు. ‘అమ్మా! నీ పాద రేణువే అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టగలదు. అది మందబుద్ధులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం. లేమితో కుంగిపోయేవారికి సకల సంపదలనూ ప్రసాదించే చింతామణుల శ్రేణి’ అని కీర్తించారు ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో. నన్నయ సరస్వతీదేవి స్తుతితోనే భారతాన్ని ఆంధ్రీకరించారు. జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీమాతను ఎవరు ప్రార్థించినా ఆ అమ్మ కటాక్ష వీక్షణాల కోసమే.

పరిపూర్ణత సిద్ధించింది..

పురాణాల్లో సరస్వతి ఆవిర్భావాన్ని గురించిన ప్రస్తావన ఉంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ ప్రకారం బ్రహ్మ సృష్టి ఆరంభించినప్పుడు.. పంచభూతాలు, జీవరాశులు ఉన్నాయి కానీ అందులో సమన్వయం కరవైంది. శబ్ద మాధుర్యం, పదాల్లో స్పష్టత లోపించాయి. జ్ఞానమార్గం కనిపించలేదు. ఇవన్నీ బ్రహ్మదేవుడికి అస్తవ్యస్తంగా అనిపించాయి. ‘సృష్టికి రూపం ఇచ్చాను కానీ ఆ సృష్టిలో ఆత్మ లోపించింది. జ్ఞానం లేని సృష్టి శూన్యమే కదా’ అని చింతించాడు. పరిస్థితిని సరిదిద్దేందుకు బ్రహ్మదేవుడు తపస్సు ఆరంభించాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించి.. క్రమంగా రూపం దాల్చింది. శ్వేతాంబరధారిణిగా, వీణాధరిగా, కమలవాసినిగా చేతిలో వీణ, పుస్తకం, అక్షమాలతో.. ప్రశాంత వదనంతో ఒక మూర్తి ప్రత్యక్షమై.. ‘నువ్వు సృష్టించిన లోకానికి అర్థాన్ని ఇచ్చేందుకు అవతరించాను’ అంది. ఆ దేవతే వాణి, వాగ్దేవి అయిన సరస్వతి. ఆ దేవి అనుగ్రహంతోనే అక్షరాలు, వేదాలు, సంగీత సాహిత్యాది కళలు ఉద్భవించాయి. మాటకు స్వరం, స్వరానికి సౌందర్యం, జ్ఞానానికి మార్గం కనిపించడంతో పరిపూర్ణత సిద్ధించింది. బ్రహ్మ సృష్టించిన రూపాలకు సరస్వతీదేవి ప్రాణం పోసింది. అందువల్లే మాఘ శుక్ల పంచమి విద్యారంభానికి, కళలు అభ్యసించడానికి ఉత్తమ దినమని చెబుతారు.

తెలుగు రాష్ట్రాల్లోనే గాక బెంగాల్, అసోం, ఒడిశా, త్రిపుర, కర్ణాటకల్లోనూ వసంత పంచమికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కవులు తమ గ్రంథాలను, విద్యాసాధనాలను దేవి ఎదుట ఉంచి.. గంధపుష్పాదులతో అర్చిస్తారు. మన పురాణాలు సరస్వతీమాతను దేవతగానే కాకుండా నదిగానూ వర్ణించాయి. జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక అయిన సరస్వతీనది ఇప్పుడు అంతర్వాహిని మాత్రమే.

ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత ప్రకృతిలో మార్పులు మొదలవుతాయి. ఆ మార్పులకు అనువైన స్వాగతోపచారాలు చేసే పర్వదినం వసంతపంచమి. ప్రకృతికి నవ చైతన్యాన్ని తీసుకొచ్చేది వసంత రుతువు. ప్రకృతి అనుకూలత, కృషి ఫలితం కలగలిపి ఈ వసంతాన్ని చదువులు, కళల ఆరాధనకు ప్రతీకగా, ఆశల రుతువుగా మారుస్తుంది. వసంత పంచమిని వసంత రుతువుకు సంకేతంగా భావిస్తాం. చల్లటి వాతావరణంతో ప్రకృతి కళకళలాడుతుంది. ఈ కాలం ఎందరో కవులకు, కథకులకు కవితా వస్తువు.

వసంత పంచమి ఒక పండుగ మాత్రమే కాదు, జీవితాన్ని సృజనాత్మకంగా, సానుకూలంగా మలచుకోమని ప్రకృతి మనకు ఇచ్చే సందేశం. సకల కళలకు అధిదేవత, వేదవాణి అయిన ఆ విధాత రాణిని పూజించడం ద్వారా లౌకిక, అలౌకిక జ్ఞానం సంప్రాప్తిస్తుంది. జ్ఞానం కొరవడితే.. జీవితం చీకటిమయమౌతుంది. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు సన్మార్గాన్ని చూపేది సరస్వతీ తత్వమే. ఆ దేవి తత్వాన్ని మనలో మేల్కొలిపే శుభదినం వసంత పంచమి. ఈ పర్వదినాన మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే వాగ్దేవికి అక్షరాంజలి ఘటిద్దాం!     

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow