అమ్మా.. లే అమ్మా.. హత్యకు గురైన తల్లి మృతదేహం పక్కన రాత్రంతా చిన్నారి రోదన
ఫరూక్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో లభ్యమైన శోభ (31) అనే మహిళ మృతదేహం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫరూక్‌నగర్ మండలం రంగారెడ్డిగూడలో ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే శోభను మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటలో హత్య చేసినట్లు తెలుస్తోంది.
సహజీవనం చేసిన వ్యక్తి ఆమెను శనివారం రాత్రి చంపేసి బస్తాలో కుక్కినట్లు సమాచారం. అనంతరం చిన్నారిని తీసుకుని బైక్‌పై ముందు భాగంలో బస్తా పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బైక్‌పై సుమారు 50-60 కి.మీ ప్రయాణించి రంగారెడ్డిగూడ వద్ద మృతదేహాన్ని పడేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
షాద్‌నగర్ పట్టణం: ఊరి చివరన నిర్జన ప్రాంతం.. రెండున్నరేళ్ల చిన్నారి.. పక్కనే రక్తపు మడుగులో తల్లి.. ఎంత లేపినా లేవడం లేదు.. ఎటుచూసినా చీకటి. ఎక్కడున్నామో, తల్లి ఎందుకు లేవడం లేదో తెలీక, ఏం చేయాలో పాలుపోక రాత్రంతా చిన్నారి గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది.
తెల్లవారిన తర్వాత చిన్నారి రోదన గమనించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం దేవునిపల్లి పరిధిలోని రంగారెడ్డిగూడలో ఆదివారం వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31)కు పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండవాసితో పెళ్లి జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.
గొడవలతో మూడేన్నరేళ్ల క్రితం భర్తతో విడిపోయిన ఈమె అదే గ్రామానికి చెందిన నర్సింహులుతో సహజీవనం చేస్తోంది. తర్వాత పాప మమత పుట్టింది. ప్రస్తుతం చిన్నారికి రెండున్నరేళ్లు.
శోభకు నర్సింహులుతో కూడా కలహాలు రావడంతో పుట్టింటికి వచ్చి తల్లితో కలిసి ఉంటోంది. శనివారం నర్సింహులు ఆమె కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని షాద్‌నగర్‌కు రమ్మన్నాడు.
కుమారుడితో కలిసి అక్కడికి చేరుకున్న శోభ సాయంత్రం వరకు నర్సింహులు రాకపోవడంతో ఇంటికి వెళ్లిపోయింది. కుమారుణ్ని ఇంట్లో ఉంచి కుమార్తెతో కలిసి మళ్లీ కోయిలకొండకు బయలుదేరింది.
ఈ మధ్యలో ఏం జరిగిందోగానీ ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డిగూడ శివారులోని ఓ పొలంలో శోభ మృతదేహం కనపడింది. ఆమె తలపై బండరాయితో మోది ఎవరో చంపేశారు.
గ్రామస్థులు రోదిస్తున్న చిన్నారిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శోభ తల్లి కరుణమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహులుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.