గ్యాస్ పీడన స్థాయి అంచనా తప్పి
ఇరుసుమండ సమీపంలోని మోరి-5 సైటులో 1993లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది. తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి లీజుకు అప్పగించారు. తాజాగా 2,700 మీటర్ల లోపల కొత్త జోన్‌లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2,500 పీడన స్థాయి(పీఎస్‌ఐ)లో గ్యాస్ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు. పీడన స్థాయి విపరీతంగా ఉండటం, మడ్ పంపింగ్ అదుపు చేయకపోవడంతో గ్యాస్ భారీగా ఎగజిమ్మింది. బ్లోఅవుట్ ప్రివెంటర్(బీవోపీ)ను నియంత్రించే స్థాయిని మించి అది బయటకు రావడంతో సిబ్బంది వెంటనే అక్కడినుంచి బయటకువచ్చేశారు. బీవోపీ వద్ద రాపిడికి అగ్నికీలలు, రెండు సార్లు పేలుళ్లు తోడవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం భగ్గుమంది. గ్యాస్‌తో పాటు మంటలు ఒకేసారి వ్యాపించి ఉంటే అక్కడ పనిచేస్తున్న వారికి ప్రాణనష్టం జరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఓఎన్‌జీసీ బావి నుంచి గ్యాస్ భారీగా లీకైనప్పుడే అధికారులు అప్రమత్తమయ్యారు. 2100 మంది జనాభా కలిగిన ఇరుసుమండ గ్రామానికి హెచ్చరికలు జారీ చేశారు.ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడి పాఠశాలలు మూసివేశారు. లక్కవరంలో మూడుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి భోజన వసతి కల్పించారు. కలెక్టర్ ఆర్.మహేశ్‌కుమార్, ఎస్పీ రాహుల్‌మీనా, ఎంపీ గంటి హరీష్‌మాథూర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తెదేపా రాజోలు నియోజకవర్గం ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్య.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాత్రి 10 గంటల వరకు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి సమీపంలోనే ఉండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు.
నష్టం రూ.వందల కోట్లలోనే..
ఇరుసుమండ బ్లోఅవుట్ నష్టం రూ.వందల కోట్లలో ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అగ్నికీలల్లో రిగ్, అందులోని లాగింగ్ టూల్, భారీ వాహనాలు కాలి బూడిదయ్యాయి. అవన్నీ డీప్ ఇండస్ట్రీస్‌కు చెందినవే. ఎగసిపడే అగ్ని కీలలతో సమీపంలో సుమారు 500 వరకు కొబ్బరి చెట్లు కాలిపోయాయని.. పంటలు, ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే నష్టంపై స్పష్టత రానుంది.
లక్కవరం ఎంజీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులు
ఇప్పటికిప్పుడు నియంత్రణ కష్టమే..
గ్యాస్ బావి నుంచి మధ్యాహ్నం ఎగసిపడిన అగ్నికీలలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమేనని అధికార వర్గాలంటున్నాయి. దీనికి ఎన్నిరోజులు పడుతుందన్నది స్పష్టత రావాల్సి ఉంది.
20 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలున్నాయ్
‘బ్లోఅవుట్ నేపథ్యంలో అందులో గ్యాస్ నిల్వలు 20-40 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చని సంబంధిత అధికారులు అంచనా వేశారు. 24 గంటల్లోగా మంటలు అదుపులోకి రాకపోతే బావి మూత(వెల్‌క్యాప్) ద్వారా అరికట్టేందుకు సంబంధిత బృందాలు చర్యలకు సిద్ధమవుతాయి. మంటలను ఆర్పేందుకు దగ్గరలో ఉన్న గూడపల్లి-1 కాలువ నుంచి నీటిని మళ్లించేందుకు గుర్తించాం. బ్లోఅవుట్ నియంత్రణలో భాగంగా ఓఎన్‌జీసీకి అన్నివిధాలా సహకారమందిస్తున్నాం. అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ మహేశ్‌కుమార్ తెలిపారు.