“డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు… చివరికి మృతదేహానికి ఆశ్రయమైంది” (జడ్చర్లలో హృదయవిదారక ఘటన)




 

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న తేజస్విని (26) మంగళవారం ఉదయం అస్వస్థతకు గురై, బ్రెయిన్ డెడ్‌గా మారి మృతి చెందింది. కేవలం ఒక సంవత్సరం క్రితమే మున్సిపాలిటీలో ఉద్యోగంలో చేరిన తేజస్వినిపై కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది.

తేజస్విని మృతదేహాన్ని ఉంచేందుకు సొంత ఇల్లు లేకపోవడం, కిరాయి ఇంట్లోకి అనుమతించకపోవడంతో కుటుంబ సభ్యులు గతంలో ఆమెకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ప్రభుత్వ ఫ్లాట్‌లో టెంట్ వేసి మృతదేహాన్ని ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కలచివేసింది.

తేజస్విని తండ్రి నాగర్‌కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామం నుంచి జడ్చర్లకు వలస వచ్చి, గత 40 ఏళ్లుగా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లిదండ్రులు, ఒక చెల్లెలు మాత్రమే ఉన్న ఈ కుటుంబం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటూ తేజస్వినిని చదివించి ఉద్యోగం వచ్చే స్థాయికి తీసుకొచ్చింది. “ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది” అని తండ్రి కలలు కన్నాడు. కానీ కాలం కఠినంగా వ్యవహరించి ఆ ఆశలన్నింటినీ ఒక్కసారిగా తుడిచేసింది.

చేతికి అందిన పెద్ద కూతురిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. అంతరిక్షానికి రాకెట్లు పంపుతున్న ఈ దేశంలో, కనీసం తలదాచుకునే ఇంటి కోసం కూడా పోరాడాల్సిన కుటుంబాలు ఉన్నాయా అనే ప్రశ్న ఈ ఘటనతో మరోసారి ముందుకు వచ్చింది. జడ్చర్లలో కనిపించిన ఈ సంఘటన పచ్చి నిజం, చేదు వాస్తవం.

ఇకనైనా ప్రభుత్వాలు ఇలాంటి పేద, నిరాశ్రయ కుటుంబాలను గుర్తించి, వారికి గూడు కల్పించే బాధ్యతను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow