Rs 400 crore heist: మిస్టరీగా రూ.400 కోట్ల దారిదోపిడీ కేసు!


 కర్ణాటక-గోవా సరిహద్దుల్లో ఘటన.. నాసిక్‌లో ఫిర్యాదు

కంటెయినర్లు లేవు.. నంబర్లు లేవు.. ఆధారాల్లేవ్‌

కేసుపై కర్ణాటక, మహారాష్ట్ర పోలీసుల భిన్నవాదనలు

బెంగళూరు: గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్న రెండు కంటెయినర్లు కర్ణాటకలో దారిదోపిడీకి గురయ్యాయన్న ఫిర్యాదు.. కలకలం రేపుతోంది. ఆ డబ్బు ఎవరో దోచేశారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అలాంటి ఘటన జరిగినట్లు తమ దృష్టిలోనే లేదని కర్ణాటక చెబుతోంది. దీనిపై ఇరు రాష్ట్రాల పోలీసులు భిన్నమైన ప్రకటనలు చేస్తుండగా, ఇది ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్న సొమ్ము అని కాంగ్రెస్, భాజపాలు పరస్పరం నిందించుకోవడం రాజకీయంగా వేడి రాజేసింది. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని నాసిక్‌ గ్రామీణ ఠాణాలో డిసెంబరు 17న సందీప్‌ దత్త పాటిల్‌ అనే వ్యక్తి ఓ ఫిర్యాదు చేశాడు.

‘అక్టోబరు 22న విశాల్‌నాయుడు, కిశోర్‌ శేఠ్‌ అనే వ్యక్తులు నన్ను కిడ్నాప్‌ చేశారు. వీరి వెనకాల ఉన్నది విరాట్‌ గాంధీ. అక్టోబర్‌ 22న రూ.400 కోట్లతో వెళ్తున్న రెండు కంటెయినర్లు దోపిడీకి గురయ్యాయి. పైగా, ఆ సొమ్ము కాజేసింది నేనేనంటూ వారిద్దరూ నెలన్నర పాటు నన్ను వేధించారు. వారి నుంచి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేస్తున్నా’ అని పేర్కొన్నాడు. ఫిర్యాదు కంటే ముందు సందీప్‌ దత్త ఓ వీడియో కూడా పోస్ట్‌ చేశాడు. అందులో రూ.వెయ్యి కోట్లు దోపిడీకి గురైనట్లు ప్రస్తావించాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి, తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటుచేసింది. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా సిట్‌ అధికారులు జనవరి 16న కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపుర పోలీస్‌ స్టేషన్‌కు ఓ లేఖ రాసి, కేసు దర్యాప్తులో సహకరించాలని కోరారు. అంతకుమించి ఏ వివరాలూ ప్రస్తావించలేదు. 

అంతా మిథ్యేనా?

ఈ కేసుపై బెళగావి ఎస్పీ రామరాజన్‌ సోమవారం ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘ఈ ఘటన బెళగావి-గోవా మార్గంలోని చోర్లా ఘాట్‌ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. మాకు మహారాష్ట్ర సిట్‌ పంపిన లేఖలో ఏ సమాచారమూ లేదు. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-32 ప్రకారం ఇది దాదాపు గాలివార్త కేసుగానే భావిస్తున్నాం. కేసు పెట్టేందుకు మా వద్ద ఎలాంటి రుజువుల్లేవు. బాధితుల ఫిర్యాదూ లేదు. కనీసం దోపిడీకి గురైన కంటెయినర్ల నంబర్లు కూడా ఇవ్వలేదు. అయినా, కేసు పూర్వాపరాలు కనుక్కోవాలని మా పోలీసులను మహారాష్ట్రకు పంపాం. వారికి అక్కడి అధికారులు సహకరించలేదు. వాళ్ల అదుపులో ఉన్న నిందితులతో మాట్లాడేందుకూ అనుమతివ్వలేదు’ అని చెప్పారు.

మహారాష్ట్ర సిట్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, లేదంటే ఆ కేసు మాకు వదిలేసినా విచారిస్తామని ఎస్పీ స్పష్టంచేశారు. దీనిపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ కూడా స్పందించారు. ‘మహారాష్ట్ర పోలీసులు మాకూ ఏ సమాచారమూ ఇవ్వలేదు. మా డీజీపీ మహారాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. వారు కోరితే సహకరిస్తాం. ఇప్పటిదాకా మా పోలీసులెవ్వరూ ఈ కేసు దర్యాప్తులో భాగస్వాములు కాలేదు. నాసిక్‌ పోలీసులు లేఖ పంపినందునే, వివరాల సేకరణకు మా పోలీసులను అక్కడికి పంపామ’ని వెల్లడించారు.

రాజకీయంగా కుదుపు

దారిదోపిడీ కేసు రాజకీయంగా మలుపు తిరుగుతోంది. ఈ సొమ్మును రానున్న అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలే తరలిస్తున్నట్లు భాజపా ఆరోపించింది. దీన్ని కర్ణాటక మంత్రులు ప్రియాంక్‌ ఖర్గే, సతీశ్‌ జార్ఖిహొళి ఖండించారు. ‘ఈ దోపిడీ గురించి సమాచారమిచ్చిందే మహారాష్ట్ర పోలీసులు. మహారాష్ట్రతో పాటు గోవాలో ఉన్నవి భాజపా ప్రభుత్వాలే. ఈ కేసులో అరెస్టైన వ్యక్తుల్లో కొందరు గుజరాత్‌ వారున్నారు. అక్టోబరు 22న ఘటన జరిగినట్లు చెబుతుండగా,  అది ముంబయి కార్పొరేషన్‌ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న సమయమ’ని గుర్తుచేశారు. ‘తరలిస్తున్న సొమ్ము పాత రెండు వేల రూపాయల నోట్లని పోలీసులు అంటున్నారు. అవి నేడు చెల్లుబాటులో లేవు. కాబట్టి, దీని విచారణ బాధ్యత కేంద్రమే తీసుకోవాల’ని మంత్రులు డిమాండ్‌ చేశారు. అంత సొమ్ము తరలిస్తున్నట్లు తమకు సమాచారముంటే, పోలీసు భద్రత కల్పించేవారమని మరో మంత్రి  ఎంబీ పాటిల్‌ చెప్పారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow