బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది రోజులుగా ఆందోళనలో కనిపిస్తున్నారు. అందుకే ప్రెస్‌మీట్‌లోనూ సీఎం రేవంత్, అధికార పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నట్టు తెలుస్తున్నది. తన తండ్రి జోలికి వస్తే ఊరుకునేది లేదని రెండ్రోజుల కిందట అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు సైతం పంపారు. పైకి గాంభీర్యంగా కనపడుతున్న లోలోపల మాత్రం తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న ఆందోళన ఆయన్ను వెంటాడుతున్నదని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో పార్టీని కేటీఆర్ ముందుండి నడిపించారు. ఆశించిన మేర ఫలితాలు రాకున్నా 30 నుంచి 40 శాతం వరకు సీట్లు సాధించి రెండో స్థానంలో పార్టీని నిలిపారు.
హడావుడి అందుకేనా?
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.2026 ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని అధికార పార్టీ సైతం ఇప్పటికే హింట్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ్టి నుంచి వార్డుల వారీగా మున్సిపల్ ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సైతం చేపట్టింది. అందుకే ఆయన ఇటీవల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారిని సన్మానిస్తూనే అక్కడి కేడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. రానున్న ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని హింట్ ఇస్తున్నారు. త్వరలోనే కేటీఆర్ జిల్లాల పర్యటన చేపడతారని కూడా గులాబీ పార్టీ హింట్ ఇచ్చింది.
వెంటాడుతున్న ఫార్ములా ఈ కార్ కేసు..
ప్రస్తుతం కేటీఆర్‌ను ఫార్ములా ఈ కార్ రేసు కేసు వెంటాడుతోంది.ఇప్పటికే విచారణ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్.. ఫార్ములా ఈ కారు రేసును నగరంలో నిర్వహించారు.అందుకు రూ.50 కోట్ల హెచ్ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అదే కంపెనీ నుంచి పార్టీ ఫండ్ వచ్చింది. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని ఈడీ సైతం ఆరోపించింది. సిట్, ఈడీ అధికారుల విచారణ ఈ కేసులో కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ .. కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేసినట్టు అంగీకరించారు. ఆయన్ను పూర్తి స్థాయిలో విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. డీవోపీటీ నుంచి ఆదేశాలు రాగానే ఆయన్ను పూర్తి స్థాయిలో విచారించి ఈ కేసులో చర్యలు తీసుకోనున్నట్టు విచారణ అధికారులు తెలిపారు.
ముందే హింట్ ఇచ్చారా?
వచ్చేఏడాది మొదటి లేదా రెండో వారంలో డీవోపీటీ నుంచి ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు సంబంధించి ఆదేశాలు వస్తాయని విచారణ అధికారులు చెబుతున్నారు.తన ఆదేశాల మేరకే హెచ్ఎండీఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ అయ్యాయని, ఏం చేస్తారు?మహా అయితే అరెస్టు చేస్తారా? చేసుకోండి అని ప్రభుత్వానికి కేటీఆర్ ఇప్పటికే సవాల్ విసిరారు. అరవింద్ కుమార్ విచారణ అనంతరం కేటీఆర్ అరెస్టు ఖాయం? అని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఆయన్ను అరెస్టు చేస్తే అటు ప్రజల్లోనూ ఆ పార్టీ పట్ల వ్యతిరేకత రావడం ఖాయంగా తెలుస్తున్నది.మరోవైపు నగరంలో కేటీఆర్‌కు మంచి పట్టుఉన్నది. ఆయన లోపల ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు భంగపాటు తప్పదు.ఈ విషయాన్ని ముందే గ్రహించిన కేటీఆర్.. నిన్న చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ‘నేను లోపల ఉంటే ఏం అవతుంది.. మున్సిపల్ ఎన్నికలను పార్టీ చూసుకుంటది’ అని హింట్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలతో ఆయన అరెస్టు తప్పదని అటు గులాబీ ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతున్నది.