Etela Rajender: ఇటీవల బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియా పోస్టులపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు.తాను బీజేపీ పార్టీ ఎంపీని. ఇటీవల కొన్ని సోషల్ మీడియా పోస్టులను తాను కూడా గమనించానని చెప్పారు. అవగాహన లేని, పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి అని వ్యాఖ్యానించారు. అవగాహన ఉన్న వ్యక్తి ఇలాంటి పోస్టులు చేస్తాడా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా బండి సంజయ్ పీఆర్వోను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలే తేల్చుకుంటారని ఆయన అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని సూచించారు. పార్టీ పరంగా ఏం చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని, దీనిపై కాలమే తుది తీర్పు చెబుతుందని వ్యాఖ్యానించారు.
ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చెబుతున్నారు అన్నది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం తాను అన్ని విషయాలు బయటపెట్టడం లేదని, సరైన సందర్భం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ముఖ్యంగా రెండో, మూడో విడత ఎన్నికలు పూర్తైన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొస్తానని ప్రకటించారు.
ఈ వివాదానికి కారణం హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పరిణామాలే. అక్కడ ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థిపై, బీజేపీ అధికారిక అభ్యర్థి గెలిచినట్లు బండి సంజయ్ పీఆర్వో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఈ పోస్టులు పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టించడమే కాకుండా, ఈటల రాజేందర్ స్థాయిని తగ్గించే ప్రయత్నంగా భావించబడ్డాయి. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ లోపలి వ్యవహారాలు బయటకు రావడం పార్టీకి నష్టం చేస్తుందని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటం చేయాల్సిన సమయంలో, అంతర్గత విభేదాలు బలహీనతగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్టులు రావడం పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఈటల రాజేందర్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా? లేక ఈ వ్యవహారాన్ని అంతర్గతంగా సర్దుబాటు చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు, బండి సంజయ్ వర్గం నుంచి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వస్తుందన్నది కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.