మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కే చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. మొన్నటివరకు గులాబీ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆమె అందులో నుంచి బయటకు వచ్చి సొంతంగా రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కుటుంబమే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిందని, తనంతట తాను బయటకు వెళ్లిపోయేలా చేశారని మీడియా ముందు పలుమార్లు ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కవిత.. త్వరలోనే పార్టీ పెడతానని, ఏదో ఒక రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని కూడా ప్రకటించారు.
కవిత విమర్శలపై మొన్నటివరకు మౌనం..
కవిత ప్రస్తుతం ఐడెంటిటీ కోసం పోరాడుతున్నట్లు పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. వారంలో రెండు నుంచి మూడు సార్లు మీడియాతో ముచ్చటిస్తున్న కవిత.. అటు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరోవైపు తనను పార్టీలో నుంచి బయటకు పంపించిన బీఆర్ఎస్ పార్టీపైనా నిప్పులు చెరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మీద కంటే ఆమె గులాబీ పార్టీ నేతలపైనే విమర్శనాస్త్రాలు అధికంగా సంధిస్తున్నారు. ఎంతైనా గులాబీ బాస్ కూతురు కావడంతో సీనియర్లు, మాజీ మంత్రులు సైతం కామ్‌గా ఉన్నారు. కానీ, అనుకోకుండా గులాబీ నేతలు కూడా రివర్స్ కౌంటర్లు గట్టిగానే ఇవ్వడం మొదలెట్టారు.
కేసీఆరే నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా?
గతంలో కేసీఆర్, కేటీఆర్,కవితకు ఆ పార్టీ నేతలంతా వినయంగా ఉండేవారు. పార్టీలో ఎప్పుడైతే అధిపత్య పోరు మొదలైందో నాటి నుంచి ఒక్కొక్కరుగా కవితను విమర్శించడం మొదలైంది. అప్పటికీ కేసీఆర్ ఎక్కడ సీరియస్ అవుతారో అని కొంతకాలం ఓపికగా ఉన్న నేతలు నెమ్మదిగా స్వరం పెంచారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె పార్టీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల అవినీతిపై, గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఎత్తిచూపుతూ వచ్చింది. మాజీమంత్రులను, ఎమ్మెల్యేలను ఆమె టార్గెట్ చేసి విమర్శలు సంధించింది. ఇటీవల మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావులపై కవిత తీవ్ర విమర్శలు చేశారు.అందుకు వారు కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రావు రవీందర్ ఆమె మీద తీవ్ర పదజాలం వాడారు. ‘కవిత సిగ్గు లజ్జా వదిలేసి బరితెగించి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, పార్టీ మీద మాట్లాడుతున్నారు. ఇలాగే చేస్తే ఎక్కడో చోట మహిళలే ఆమెకు బుద్దిచెబుతారు’ అని ఓ టీవీ డిబెట్‌లో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ కూతురి మీద ఇలా కామెంట్స్ చేయడానికి అసలు వీళ్లకు ఇంతధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? పార్టీ అధినేతే ఇచ్చారా? అని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా, పార్టీకి వ్యతిరేకంగా కవిత గళం వినిపిస్తున్నదని, ఇలా చేస్తే ప్రజల్లో పార్టీ పరువు మరింత దిగజారుతుందని, వచ్చే టర్మ్‌లోనూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తాయని లీడర్లంతా కేసీఆర్ వద్ద మొరపెట్టుకున్నట్టు సమాచారం. ఇప్పటికే జూబ్లీహిల్స్, తాజాగా సర్పంచ్ తొలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఈ పరిస్థితులను కేసీఆర్‌కు వివరించగా.. పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళితే ఎవరని ఉపేక్షించవద్దని కేసీఆర్ నేతలకు భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఎమ్మెల్సీ రవీందర్ కవిత మీద రెచ్చిపోయినట్టు టాక్ వినిపిస్తున్నది.