Cyber Scam Alert: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఇలాంటి ఫేక్‌ లింక్‌లతో జాగ్రత్త!


 నూతన సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూఇయర్‌ శుభాకాంక్షలు (Happy New year Celebrations), గిఫ్ట్‌లు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఆఫర్లు, ప్రయాణ రాయితీలు, ఈవెంట్‌ టికెట్లు అంటూ వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌, సోషల్‌ మీడియా ద్వారా నకిలీ లింక్‌లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి లింక్‌లతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలంగాణ సైబర్‌ బ్యూరో అధికారులు. ఆలోచించకుండా వాటిపై క్లిక్‌ చేస్తే మీ మొబైల్‌లో హానికరమైన యాప్‌లు ఇన్‌స్టాల్‌ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో మీ ఓటీపీలు, బ్యాంకు వివరాలు చోరీకి గురికావడం, వాట్సప్‌ ఖాతా దుర్వినియోగమవ్వడం వంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్‌ బ్యూరో (TGCSB) అధికారులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయొద్దని, ఒకవేళ ఏదైనా మోసం జరిగితే  వెంటనే 1930కు కాల్‌ చేయడం లేదా http://cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చని టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ సూచించారు. 

ఈ దాడి ఎలా జరుగుతుంది?

కొత్త సంవత్సర ఉత్సాహం, ఆసక్తులను అదనుగా చేసుకొని సైబరాసురులు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌లో హ్యాపీ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు లేదా గిఫ్ట్‌ లింక్‌ వంటివి పంపుతుంటారు. ఇలాంటి లింక్‌లపై క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో హానికరమైన ఏపీకే ఫైల్‌ రహస్యంగా ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఒకసారి ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత.. ఆ మాల్వేర్‌ ఓటీపీలు, బ్యాంకింగ్‌ వివరాలు, కాంటాక్టులు, ఫొటోలు, వాట్సప్‌ను యాక్సెస్‌ చేయగలదు. దీంతో నేరగాళ్లు మీ పేరుతో ఇతరులను మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ లింక్‌లు తరచూ పరిచయమైన వ్యక్తులు లేదా కుటుంబ సభ్యుల గ్రూపుల ద్వారా ఫార్వార్డ్‌ అవుతాయి. అందువల్ల అవి నిజమైనవిగా అనిపిస్తుంటాయి. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయమని లేదా అప్‌డేట్‌ చేయాలని కోరే శుభాకాంక్షలు/గిఫ్ట్‌ లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్దు.

  • లింక్‌పై క్లిక్‌ చేస్తే ఏపీకే ఫైల్‌ డౌన్‌లోడ్‌ / ఇన్‌స్టాల్‌ అవుతుంది.
  • హానికరమైన యాప్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా పనిచేస్తుంది.
  • ఓటీపీలు, మెసేజ్‌లు, కాంటాక్టులు, వాట్సప్‌ సెషన్లపై అనధికార యాక్సిస్‌ లభిస్తుంది.
  • బాధితుడి ఖాతాను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు ఇతరులను మోసం చేస్తారు.

వెంటనే ఏం చేయాలి?

  • మీరు నకిలీ లింక్‌పై క్లిక్‌ చేసినా.. అనుమానాస్పద యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినా వెంటనే మొబైల్‌ డేటా, వైఫై ఆఫ్‌ చేయండి.
  • ఆ అనుమానాస్పద యాప్‌ను తక్షణమే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి.
  • అన్ని వివరాలూ నమోదు చేసుకోండి: మెసేజులు, లింక్‌లు, పాప్‌అప్స్‌ స్క్రీన్‌షాట్‌లు, ట్రాన్సాక్షన్‌ ఐడీలు, యూటీఆర్‌ నంబర్లు, కాల్‌ లాగ్స్‌, చాట్ హిస్టరీ
  • వాట్సప్‌ అయితే.. లింక్డ్‌ డివైజెస్‌ చెక్‌ చేసి తెలియని డివైజ్‌లను తొలగించండి.
  • వాట్సప్‌, ఈమెయిల్‌, బ్యాంకింగ్, సోషల్‌ మీడియా పాస్‌వర్డ్‌లను మార్చండి.
  • నగదు లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంక్‌/పేమెంట్‌ యాప్‌కు సమాచారం ఇవ్వండి.


జాగ్రత్తలివీ.. 

  • వాట్సప్‌/ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే శుభాకాంక్షలు, గిఫ్ట్‌, ఆఫర్‌ లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దు.
  • మెసేజ్‌ల ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్‌ని ఎప్పుడూ ఇన్‌స్టాల్‌ చేయొద్దు.
  • ఓటీపీలు, పిన్‌లు, సీవీవీలు లేదా వెరిఫికేషన్‌ కోడ్‌లను ఎవరికీ చెప్పొద్దు.
  • వాట్సప్‌లో టు-స్టెప్‌ వెరిఫికేషన్‌ ప్రారంభించండి.
  • యాప్‌లను అధికారిక యాప్‌ స్టోర్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌/అప్‌డేట్‌ చేయండి.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow