Vaikuntha ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వ్రతం.. ఈ 7 నియమాలు ఆచరిస్తే పుణ్యం!


 ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi) రోజున స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ పుణ్య దినాన విష్ణాలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం, అమృతం ఉద్భవించిందీ ఈ రోజునే. అందుకే ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు (డిసెంబరు 30, మంగళవారం)న ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువుని షోడశోపచార విధితో పూజించి, నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్య ఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించరాదు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులవుతారని పురాణ వచనం. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదమే గాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరించేందుకూ ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమే ఓ దివ్యాస్త్రం. 

ఉపవాసం అంటే.. 

ఉపవాసం అంటే కేవలం నిరాహారం మాత్రమే కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవ్వాలనేదే ఉపవాసం పరమార్థం. వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థమూ తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులూ ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణ వచనం. ముర అంటే తామసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు గనక మందబుద్ధినిచ్చి జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఒకరోజు భోజనం చేయకుండా తరువాతి రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఏకాదశినాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. పూజ, జపం, ధ్యానం లేదా ఉపావాసం మొదలైన సాధనల ద్వారా మాధవుడిపై మనసుని లగ్నం చేయాలి. 

ఏకాదశి వ్రతంలో 7 నియమాలివీ.. 

  1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
  2. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి.
  3. ఆ రోజున అబద్ధం ఆడకూడదు. 
  4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
  5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
  6. ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
  7. అన్నదానం చేయాలి.

ద్వాదశి రోజున మళ్లీ భగవతారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఉపవాసం చేయలేనివారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు వంటి పదార్థాలు తిని ఉండొచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం, గో సేవ, శక్తిని అనుసరించి చేసే దానధర్మాలు మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా.. ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

తాత్త్విక సందేశం: విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు. దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు.. మొత్తం పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించాలని భావం. పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే ఈ స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి అనే సాధనా శక్తి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow