పల్లెకు పోదాం.. ఓటేసి వద్దాం..


 రాజధాని నుంచి గ్రామాలకు ఓటర్ల పయనం

పలు మార్గాల్లో బస్సులన్నీ కిటకిట

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మల్లేష్‌ కుటుంబంతో హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చి ఓ అపార్టుమెంటు వాచ్‌మేన్‌గా పని చేస్తున్నారు. స్వగ్రామంలోనే రేషన్‌ కార్డు, ఓటు హక్కు ఉంది. పంచాయతీ ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కుటుంబ సభ్యులందరినీ వెంటబెట్టుకుని బుధవారం గ్రామానికి వెళ్లారు.

 ..ఇలాగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వేల మంది పల్లెవాసులు నగరం నుంచి తరలి వెళ్లడంతో బస్సుల్లో బుధవారం అనూహ్యంగా రద్దీ పెరిగింది. దీంతో పలు మార్గాల్లో సర్వీసులు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పంచాయతీ సర్పంచులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు.. ఊరి నుంచి నగరాలకు వలస వెళ్లిన ఓటర్లను రప్పించేందుకు దారిఖర్చులు, ఇతర నజరానాలు ఇచ్చి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇదీ పరిస్థితి..: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చి నివసిస్తున్నా.. అత్యధికుల శాశ్వత చిరునామా గ్రామాల్లోనే ఉంటోంది. 18 ఏళ్లు దాటిన విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం నగరానికి వస్తున్నారు. వేల సంఖ్యలో ఉండే వీరిలో.. గ్రామాల్లో చిరునామా ఉన్న వారే అధికం. పల్లెల్లో ఓట్ల పండగ రావడంతో వీరంతా గ్రామాల బాట పట్టారు. సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కొడంగల్, సంగారెడ్డి ప్రాంతాల బస్సులకు రద్దీ ఎక్కువగా ఉందని, డిమాండ్‌ను బట్టి అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. బుధవారం ఒక్కరోజే దాదాపు లక్ష మంది వరకు ఓటర్లు పల్లెలకు ప్రయాణం కట్టినట్లు అంచనా

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow