రామాపూర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రచ్చ రచ్చ


 కొల్లాపూర్ : కొల్లాపూర్ మండలం రామాపూర్ గ్రామంలో రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఫ్లెక్సీ పంచాయతీ పై బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ధర్మకర్త ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఫ్లెక్సీని తొలగించాలంటూ కాంగ్రెస్‌ నాయకులు పట్టుబట్టగా, బీఆర్ఎస్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పరిస్థితి ఘర్షణకు దారితీసింది. గ్రామంలోని బస్టాండ్‌ సమీపంలో సుమారు రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం కొనసాగింది. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పెంట్లవెల్లి ఎస్‌ఐ రామన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పంచాయతీ కార్యదర్శి పవన్‌కుమార్‌ జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లాపూర్ మండలం రామాపూర్‌లో బస్టాండ్ సమీపంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రచ్చకట్టలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. రైతులు, గ్రామస్తులు, ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు వీటిపై విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ రచ్చకట్టకు కలుపుకొని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలయ ధర్మకర్త నిరంజన్ గౌడ్ దంపతుల ఫోటోతో పాటు దేవుళ్ల చిత్రాలతో హోల్డింగ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, దీనిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సమయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా, ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఫ్లెక్సీ ఆలయ ధర్మకర్తదేనని, పార్టీకి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రచ్చకట్ట వద్ద కాంగ్రెస్ జెండా దిమ్మె నిర్మించుకునేందుకు అనుమతించాలని, ఫ్లెక్సీని తప్పనిసరిగా తొలగించాలని కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు నచ్చజెప్పినా ఇరువర్గాలు వినకపోవడంతో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు. ఇరుపార్టీలకు గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow