కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం, ఆ సముద్రంలోకి వచ్చి, పోయే నాయకులు అనేకం. అక్కడ అందరికీ ప్రైవసీ ఉంటుంది. అక్కడి నాయకులకు స్వతంత్ర్యం, వాక్ స్వాతంత్రం ఎక్కువే. ఎవరికి వారే ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా విమర్శించవచ్చు, అట్లాగే గ్రూప్ రాజకీయాలు మస్తుగుంటయ్, అట్లాగని క్రమశిక్షణకు పార్టీలో కొదువ లేదు. చివరగా చెప్పాలంటే రాజకీయ ఉద్దండులు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాల్సిందే! అలాంటి కాంగ్రెస్ పార్టీ లో గత 30 ఏళ్లుగా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొని, అనేక ఆటుపోట్లను తట్టుకొని నిలిచిన నాయకుడు సంజీవ్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ విజయాలలో, అపజయాలలో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటూ, అవమానాలను, హేళనలను పంటి బిగువున భరించుకుంటూ పార్టీని అట్లే అంటిపెట్టుకుని ఉండి పార్టీ కార్యకర్త స్థాయి నుండి అంచలంచెలుగా జిల్లా కమిటీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. క్రమశిక్షణతో మెలిగి డిసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారాయన. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా, పార్టీని అంటిపెట్టుకొని, ఎన్నో ప్రలోభాలు, ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా లెక్కచేయక ఎదురొడ్డి నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్న నిబద్ధత గల నాయకుడు సంజీవ్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు వల్లమాలిన అభిమానం అంటారాయన. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియమ్మ, రాహుల్ గాంధీ అంటే తనకెంతో ఇష్టమని, దేశం కోసం వారి కుటుంబాలను త్యాగం చేసిన ఘన చరిత్రను ఎప్పటికీ ఎవ్వరూ మరువలేరని సంజీవ్ ముదిరాజ్ ప్రగాఢ విశ్వాసం. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక తెలంగాణ ను ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని, తెచ్చుకున్న తెలంగాణ కలల సాకారం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన నొక్కి వక్కాణించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలోకి ధూసుకపోతుంటే, జిల్లాలోని మూడు నియోజకవర్గాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల శాసన సభ్యులు ఎవరికి వారే పార్టీ పటిష్టతకు, ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాల అమలును ఉరుకులు పెట్టిస్తున్నారని సంజీవ్ ముదిరాజ్ ప్రశంసించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదిగి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేస్తున్నాడు సంజీవ్ ముదిరాజ్. రాబోయే కాలంలో అందరి సహకారంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారాయన. ఇక వేచి చూడాల్సిందే...
Tags
mahabubnagar