చారకొండ (వెల్దండ గ్రామీణం): తమ గ్రామాలు ముంపునకు గురి కాకుండా శాసనసభలో చర్చించి న్యాయం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌కు చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన భూనిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌ను.. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, జనార్ధన్‌రెడ్డి, ముంపు బాధితులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. డిండి-నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గోకారం, ఎర్రవల్లి శివారులో నిర్మించే జలాశయంతో తమ గ్రామ పంచాయతీ పూర్తిగా ముంపునకు గురవుతుందని, దీంతో తమ బతుకులు రోడ్డున పడుతాయన్నారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు 27 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా, సర్పంచి ఎన్నికలను బహిష్కరించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జలాశయ సామర్థ్యాన్ని తగ్గించి, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు చేసే విధంగా శాసనసభలో మాట్లాడి.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. మాజీ సర్పంచి సాయికుమార్, నాయకులు సదానందంగౌడ్, ప్రకాష్, పర్వతాలుగౌడ్, రాంచంద్రాయ్య, పెద్దయ్యగౌడ్, తదితరులు కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Tags
mahabubnagar