నాలుగు రోజుల్లో రూ.240 వరకు పెరిగిన చికెన్ ధర - ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనుండటంతో పెరిగిన డిమాండ్ - ఓటర్లకు చికెన్, శీతల పానీయాలు ఇచ్చేలా సర్పంచ్ అభ్యర్థుల ప్రణాళికలు
Chiken Prices Increased During Sarpanch Elections : తెలంగాణలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. బుధవారం మొదటి విడత నామపత్రాల ఉపసంహరణ గడువు 3 గంటలతో ముగుస్తోంది. బరిలో ఎవరుంటారు. ఎవరు వైదొలగుతారో సాయంత్రం వరకు తేలనుంది. ఇక ఫైనల్‌గా బరిలో నిలిచే అభ్యర్థుల ప్రచారం ఊపందుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లతో పాటు ప్రచారంలో పాల్గొనే వారికి మద్యం, మాంసాహారం అభ్యర్థులు రోజూ పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చికెన్ వ్యాపారులు ఉన్నట్టుండి మెల్లగా ధర పెంచేశారు.
కిలో చికెన్ రూ. 240 : ఎన్నికల ప్రక్రియకు ముందు గ్రామాల్లో కిలో చికెన్ రూ.200 నుంచి రూ.220 వరకు ఉండేది. గత నాలుగైదు రోజులుగా రూ.240 వరకు పెరిగింది. అక్కడే చికెన్ వండిస్తే రూ.330 వరకు తీసుకుంటున్నారు. రోజూ ఎంత మంది ఓటర్లకు, ఎంత పంపిణీ చేయాలో ఎన్నికలో నిల్చునే అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. ఈ మేరకు మాంసం వ్యాపారులతో ముందస్తుగానే మాట్లాడుకుంటున్నారు.
ఖర్చు కోట్లలోనే : గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి అరకిలో చికెన్, కూల్ డ్రింక్స్ అందించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో వేల సంఖ్యలో చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఓటర్ల సంఖ్యను చూసి వచ్చే 8 రోజుల్లో రోజుకు ఒక్కో దుకాణంలో 100 నుంచి 400 కిలోల చికెన్ విక్రయించనున్నారు. రాష్ట్రంలో ఇలా అభ్యర్థులు రోజూ మాంసం ఖర్చులే రూ.3.50 కోట్లు భరించాల్సి ఉంటుంది. 8 రోజుల్లో రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు కేవలం చికెన్ పైనే వ్యయం చేయనున్నారు.
'చికెన్‌కు డిమాండ్ పెరుగుతోంది. తొలి విడత పోరు జరుగుతున్నందున మా మండలంలో రోజు వారి ఆర్డర్లు పెరిగాయి. ముఖ్యంగా అభ్యర్థుల అనుచరులు బల్క్ ఆర్డర్లు చెబుతున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ధర పెరిగింది. రాబోయే రోజుల్లో ధర మరింత పెరగడం ఖాయం' అని చికెన్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.
అన్నింటికి లెక్క చెప్పాల్సిందే : ఎన్నికల్లో ప్రచారానికి అభ్యర్థులు ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేయడానికి వీలులేదు. ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు మాత్రమే వినియోగిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చు చేస్తున్న విషయాన్ని వ్యయ పరిశీలకులు గమనిస్తూనే ఉంటారు. ప్రచారంలో జెండాలు కనిపించినా వాటిని కూడా లెక్కలు వేస్తారు. అందువల్లే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇవీ నిబంధనలు
- మేజర్ గ్రామ పంచాయతీల్లో 5 వేలకు పైగా జనాభా ఉంటే సర్పంచి అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.50 వేలు ఖర్చు చేయవచ్చు.
- 5 వేల లోపు జనాభా ఉంటే సర్పంచి అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.30 వేలకు పరిమితి ఉంది.
- ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎలక్షన్ అధికారులకు సమర్పించాలి.
- అధికారుల లెక్కలకు, అభ్యర్థులు చూపించిన ఖర్చులకు సరిపోయే విధంగా ఉండాలి. లేదంటే మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా కఠినమైన నిషేధం విధిస్తారు.
- ప్రచారంలో ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకుని వెళ్లినా కూడా అది అభ్యర్థి వ్యయం కిందికే వస్తుంది.
- ప్రచారం చేసే వాహనాలకు ఎన్నికల అధికారుల వద్ద నుంచి తప్పకుండా అనుమతి ఉండాలి.