గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని, ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు.. వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్(KCR)ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి, గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను వారిని కేసీఆర్ శాలువాతో సత్కరించి, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను, గుర్తుపట్టి, పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి పేరు పేరునా అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. "మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్నికొన్ని సమయాలు కష్టాలు వస్తయి. వాటికి వెరవకూడదు. మల్లా మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి. అప్పడిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలె" అని కేసీఆర్ గ్రామస్థులకు వివరించారు.
ఇప్పుడు నూతనంగా ఎన్నికైతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ మన పల్లె అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు" అని కేసీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా వారికి జాతీయ, అంతర్జాతీయంగా పల్లెల ప్రగతి కోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కేసీఆర్ వివరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తి దాత, ప్రొఫెసర్ యూనిస్‌తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల గురించి వారి కృషిని వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచి, నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్, వార్డు మెంబర్లు, నర్సన్నపేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య, ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు సమావేశంలో హాజరయ్యారు. వారిని కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.